V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ హిందీ ‘ఛత్రపతి’లో కథానాయకునిగా ఎంచుకున్నారు వినాయక్. తొలి సినిమా ‘ఆది’తోనే అదరహో అనిపించిన వినాయక్, మొదటి హిందీ చిత్రంతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో అని తెలుగు సినీజనం ఆసక్తిగా చూస్తున్నారు.
వినాయక్ పూర్తి పూరు గండ్రోతు వీర వెంకట వినాయక రావు. అందరూ అభినామంగా ‘వినయ్’ అని పిలిచేవారు. చిన్నప్పుడు చిరంజీవి యాక్షన్ మూవీస్ చూసి, సినిమాలపై అభిమానం పెంచుకున్నారు వినయ్. ఎలాగైనా చిత్రసీమలో తనదైన బాణీ పలికించాలన్న అభిలాషతో బయలు దేరారు. ఆరంభంలో కొంతమంది దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వినయ్, తరువాత డైరెక్టర్ సాగర్ తెరకెక్కించిన సినిమాలకు కో-డైరెక్టర్ గా ఉన్నారు. ప్రేక్షకులు కోరుకొనేది మనం అందిస్తే చాలు, విజయం తథ్యం అనే సూత్రాన్ని వినాయక్ బాగా నమ్ముతారు. అప్పట్లో ‘సమరసింహారెడ్డి’ ఘనవిజయంతో తెలుగునాట ఫ్యాక్షన్ డ్రామాలకు భలే క్రేజ్ ఉండేది. దాంతో వినయ్ సైతం అదే రూటులో సాగుతూ తొలి ప్రయత్నంలోనే ఫ్యాక్షన్ డ్రామాను ఎంచుకొని ‘ఆది’ తెరకెక్కించారు. జూ.యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘ఆది’ చిత్రం అనూహ్య విజయం సాధించింది. వెంటనే బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’లో అదే సూత్రం పాటించారు. అయితే అప్పటికే ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంగా చూపిన చిత్రాలలో బాలకృష్ణ నటించేసి ఉండడంతో ‘చెన్నకేశవ రెడ్డి’ ఆ స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. తన మూడవ చిత్రం ‘దిల్’తో యువకుల మదిని జిల్ మనిపించారు వినయ్. ఆ సినిమా నిర్మాత ‘దిల్’నే ఇంటిపేరుగా మార్చుకొని నేడు దిల్ రాజుగా చిత్రసీమలో సాగుతున్నారు. ఇక వినయ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘ఠాగూర్’. చిరంజీవితో వినయ్ తీసిన ఈ తొలి చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే ఈ నాటికీ బిగ్ హిట్ గా నిలచింది.
తన తొలి హీరో జూనియర్ యన్టీఆర్ తో “సాంబ, అదుర్స్” వంటి చిత్రాలను రూపొందించారు వినాయక్. వీటిలో ‘అదుర్స్’ ఈ నాటికీ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంది. బుల్లితెరపై ‘అదుర్స్’ వస్తోందంటే చాలు ప్రేక్షకులు కళ్ళప్పగించి టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. వెంకటేశ్ హీరోగా వినాయక్ రూపొందించిన ‘లక్ష్మీ’ బంపర్ హిట్ అయింది. రవితేజతో వినయ్ తెరకెక్కించిన ‘కృష్ణ’ జనాన్ని ఆకట్టుకుంది. రామ్ చరణ్ తో వినాయక్ తీసిన ‘నాయక్’ విజయకేతనం ఎగరేసింది. ఇక అల్లు అర్జున్ తో “బన్నీ, బద్రీనాథ్” రూపొందించారు. ప్రభాస్ తో ‘యోగి’, సాయిధరమ్ తేజ్‌తో ‘ఇంటెలిజెంట్’ తీశారు. వినాయక్ తొలి చిత్రం ‘ఆది’ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కు, వినయ్ అంటే మంచి గురి. అందువల్ల తన తనయుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయంచేస్తూ వినాయక్ డైరెక్షన్‌లోనే ‘అల్లుడు శీను’ నిర్మించారు. ఈ చిత్రంతో సాయి శ్రీనివాస్ హీరోగా మంచి మార్కులే సంపాదించాడు. ఇక అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘అఖిల్’కు కూడా వినయ్ దర్శకుడు.
చిరంజీవి రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా ‘ఠాగూర్’ను నిలిపారు వినాయక్. ఆ నమ్మకంతోనే చిరంజీవి రీ ఎంట్రీగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 150’కి వినాయక్ ను దర్శకునిగా ఎన్నుకున్నారు. చిరంజీవి 150వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కూడా మంచివిజయం సాధించింది. ఇలా పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్న వినాయక్ తన మొదటి హిందీ చిత్రంతోనూ సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఆశిద్దాం.
(అక్టోబర్ 9న దర్శకుడు వినాయక్ పుట్టినరోజు)