కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర వేదికగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కన్నడలో రిలీజ్ చేస్తున్న నిర్మాత వెంకట్ బాగా ఎరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం వంటిదని రాజమౌళి అభివర్ణించాడు. అంతేకాకుండా మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చి కొనియాడాడు. మరోవైపు తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ అని రాజమౌళి స్పష్టం చేశాడు. పేరుపేరునా అసిస్టెంట్ డైరెక్టర్‌లకు రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశాడు. త్వరలో మరో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఉందని.. హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారని.. వాటిని షూట్ చేశామని.. ఈ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా విడుదల చేస్తామని జక్కన్న తెలిపాడు.
మరోవైపు టిక్కెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా రాజమౌళి థ్యాంక్స్ తెలియజేశాడు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లపై గతంలో కొత్త జీవో జారీ చేసినప్పుడు తమకు ఇబ్బంది అవుతుందని అందరూ భావించామని.. కానీ ముందుకు వెళ్లలేకపోయామని జక్కన్న వ్యాఖ్యానించాడు. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి తమను ముందుకు నడిపించారని కొనియాడారు. తమను నెగ్గించడం కోసమే మెగాస్టార్ తగ్గారని.. దానిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చాలా మాటలు అన్నారని రాజమౌళి తెలిపాడు. నిజంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అని అభివర్ణించారు. ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనే కంటే ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టంగా ఉంటుందన్నారు.