మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో పాటు ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషించాడు. అలానే స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే దసరా కానుకగా చెర్రీ అభిమానులకు మాత్రం డబుల్ థమాకా లభించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్త అధికారికంగా వచ్చింది. అలానే పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్’ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తోనూ రామ్ చరణ్ మూవీ చేయబోతున్నాడనే వార్త గతంలోనే వెలువడింది. ఇవాళ ఆ ప్రాజెక్ట్ లో మరో ముందడుగు పడింది. తాజాగా ప్రశాంత్ నీల్ తన నిర్మాత డీవీవీ దానయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవిని, రామ్ చరణ్ ను కలిశాడు. మెగాస్టార్ ను కలవడంతో చిన్ననాటి కల నెరవేరినట్టు ప్రశాంత్ నీల్ తెలిపాడు. అలానే ప్రశాంత్ నీల్ తో సాయంత్రం ఆహ్లాదకరంగా సాగిందని చెర్రీ కూడా ట్వీట్ చేశాడు. అయితే శంకర్ మూవీ తర్వాత ఏ సినిమా సెట్స్ పైకి వస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇంకా రాలేదు. గౌతమ్ తిన్ననూరి హిందీలో రూపొందిస్తున్న ‘జెర్సీ’ రీమేక్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అలానే ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ -2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజులు గడిస్తే కానీ ఏది ముందు, ఏది తర్వాత సెట్స్ కెళతాయనే అనేది తెలికపోవచ్చు.