తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు తమ అభిరుచికి తగ్గ చిత్రాలనూ అందించారు.
పోలుదాసు పుల్లయ్య 1911 మే 2న నెల్లూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలపై విపరీతమైన మక్కువ ఉండేది పుల్లయ్యకు. అలా ఆ ఇష్టం పెరిగి పెరిగి పుల్లయ్య చిత్రసీమకు పరుగు తీసేలా చేసింది. అప్పట్లో కలకత్తాలో కానీ, బొంబాయిలో కానీ సినిమాల నిర్మాణం సాగేది. అక్కడకు వెళ్ళి సినిమాలకు దర్శకత్వం వహించిన వారిలో పి.పుల్లయ్య ఒకరు. 1935లో ‘హరిశ్చంద్ర’ చిత్రం ద్వారా పుల్లయ్య దర్శకునిగా పరిచయం అయ్యారు. అదే సమయంలో ‘శశిరేఖా పరిణయం’లో శశిరేఖగా నటించి, విశేషాదరణ చూరగొన్నారు నటి శాంతకుమారి. ఆమె అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. ఆమెను చిత్రాంగిగా నటింపచేసి, పి.పుల్లయ్య ‘సారంగధర’ రూపొందించారు. ఆ సినిమా తరువాత పుల్లయ్య, శాంతకుమారి నడుమ ప్రేమ చిగురించింది. తరువాత కళ్యాణం జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామి లీలల నేపథ్యంలో ‘బాలాజీ’ చిత్రాన్ని 1939లో తెరకెక్కించారు పుల్లయ్య. ఇందులో పద్మావతిగా శాంతకుమారి నటించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ తరువాత ఇదే ఇతివృత్తంతో 1960లో తమ పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రం రూపొందించారు పుల్లయ్య. ఇందులో శ్రీనివాసునిగా యన్టీఆర్ నటించగా, శాంతకుమారి వకుళామాతగా నటించడం విశేషం! ఈ సినిమా అప్పట్లో థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని ప్రతీతి.
పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘ధర్మపత్ని’ ద్వారానే ఏయన్నార్ తొలిసారి తెరపై కనిపించారు. “ప్రేమబంధం, సుభద్ర, భాగ్యలక్ష్మి, మాయామశ్చీంద్ర, భక్త జన, ధర్మదేవత, రేచుక్క, కన్యాశుల్కం, అర్ధాంగి, ఉమాసుందరి, జయభేరి, బండరాముడు, సిరిసంపదలు, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, అల్లుడే మేనల్లుడు, కొడుకు-కోడలు, అందరూ బాగుండాలి” వంటి తెలుగు చిత్రాలు, “మచ్చ రేకై, వీటుకారి, మనం పోల మాంగల్యం, పెన్నిన్ పెరుమై, ఇల్లారమే నల్లారం, ఆసై ముగం, తాయే ఉనక్కాగ” మొదలైన తమిళ చిత్రాలను పి.పుల్లయ్య రూపొందించారు. యు.విశ్వేశ్వరరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హరిశ్చంద్రుడు’ చిత్రంలో పి.పుల్లయ్య నటించి అలరించారు. ‘హరిశ్చంద్ర’ (1935) చిత్రంతో దర్శకునిగా పరిచయమైన పి.పుల్లయ్య , ‘హరిశ్చంద్రుడు’ (1980)లో నటించడం విశేషం!
పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు ప్రేక్షకుల రివార్డులతో పాటు, ప్రభుత్వ అవార్డులనూ అందుకున్నాయి. 1981లో పి.పుల్లయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేశారు. ఆ తరువాత 1999లో ఆయన భార్య శాంతకుమారి కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకోవడం విశేషం! అప్పట్లో తెలుగు సినిమా రంగంలోని వారు పి.పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అని పిలిచేవారు. 1987 మే 29న పి.పుల్లయ్య కన్నుమూశారు. ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై సందడి చేస్తూనే ఉన్నాయి.