Director Mohan Raja Reveals His Plans On Dhruva 2 With Ram Charan: ఒక సినిమా మంచి విజయం సాధించి, సీక్వెల్‌కి ఆస్కారం కలిగి ఉంటే.. కచ్ఛితంగా ఆడియెన్స్ దాని సీక్వెల్‌కి డిమాండ్ చేస్తారు. ఆలస్యమైనా సరే, సీక్వెల్ కావాల్సిందేనని పట్టుబడతారు. ‘ధృవ’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. దొంగా-పోలీస్ ఆట తరహాలో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సినిమా.. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంది. డీమోనిటైజేషన్ లాంటి క్లిష్ట పరిస్థితుల్ని సైతం ఎదుర్కొని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసిందంటే.. ఇది ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈ చిత్రానికి సీక్వెల్ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత అభిమానులు కోరిన ఆ కోరిక.. నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది. అవును, స్వయంగా దర్శకుడు మోహన్ రాజానే ధృవ సీక్వెల్ ఉండొచ్చన్న సంకేతాలు ఇచ్చారు.
ఇంతకుముందే.. తాను రామ్ చరణ్‌తో కొన్నిసార్లు ‘ధృవ 2’ సినిమా చర్చలు జరిపానన్న మోహన్ రాజా చెప్పారు. ఇప్పుడు గాడ్‌ఫాదర్ సక్సెస్ అవ్వడంతో ఇంటర్వ్యూలు ఇస్తోన్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో భాగంగా ధృవ 2 తప్పకుండా ఉంటుందన్న సంకేతాలిచ్చారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో తనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందన్న మోహన్ రాజా.. ఆయన వల్లే రామ్‌చరణ్‌తో పరిచయం ఏర్పడిందని అన్నారు. తాము ధృవ2 చర్చలు జరుపుతున్న సమయంలోనే గాడ్‌ఫాదర్ ఆఫర్ వచ్చిందన్నారు. ఇక ఈమధ్య కాలంలో కూడా తనకు, చరణ్‌కు మధ్య ‘ధృవ 2’ చర్చలు జరిగాయని.. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ సినిమా తప్పకుండా ఉంటుందన్నారు. తన తమ్ముడి జయం రవితో ‘తని ఒరువన్ 2’ చేయడానికన్నా.. రామ్ చరణ్‌తో ధృవ 2 చేసేందుకు తాను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానన్నారు. ఒకవేళ కుదిరితే.. ఏకకాలంలో తమ్ముడితో తమిళ వర్షన్, చరణ్‌తో తెలుగు వర్షన్ షూటింగ్స్ ప్రారంభిస్తానన్నారు. కుదరని పక్షంలో.. చరణ్‌తోనే తొలుత ధృవ2 చేస్తానని చెప్పారు. మరి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.