Lingu Samy: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇటీవలే ది వారియర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లింగుసామికి ఇక్కడ కూడా పరాజయమే ఎదురయ్యింది. ఉస్తాద్ రామ్ అయినా హిట్ ఇస్తాడు అనుకున్న లింగుసామికి నిరాశే మిగిలింది. ఇక తాజాగా ఈ డైరెక్టర్ కు కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సయిదా పేట కోర్టు ఎన్. లింగు స్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. పీవీపీ క్యాపిటల్ ప్రొడక్షన్ కంపనీలో లింగుసామి అతడి సోదరుడు సుభాష్ చంద్ర ఒక సినిమా చేస్తామని రూ. 1.03 కోట్లు తీసుకున్నారు. చెప్పినట్లుగానే.. కార్తీ, సమంత జంటగా ఈ సినిను మొదలుపెట్టాడు లింగుసామి. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ముందుకు సాగలేదు.
ఇక ఈ సినిమాకోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ క్యాపిటల్ ప్రొడక్షన్ కంపనీ, లింగుసామిపై కేసు వేసింది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడంలేదని, ఆయన ఇచ్చిన చెక్స్ అన్ని బౌన్స్ అయ్యినట్లు సదురు నిర్మాతలు కోర్టులో తెలిపారు. ఇక ఈ కేసును విచారించిన కోర్టు లింగుసామికి అతని సోదరుడుకు ఆరు నెలలు జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ తీర్పు కు షాక్ అయిన లింగుసామి హైకోర్టుకు అప్పీల్ చేసినట్లు సమాచారం.