Dilip Kumaమహానటుడు దిలీప్ కుమార్ పేరు వినగానే ‘ట్రాజెడీ కింగ్’ అన్న ఆయన ట్యాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా ‘స్వర్ణయుగం’ చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్ నటించిన అనేక చిత్రాలు సంగీతసాహిత్యాల పరంగా ప్రేక్షకుల మదిని దోచాయి. ముఖ్యంగా విఖ్యాత సంగీత దర్శకులు నౌషద్, ప్రఖ్యాత గీత రచయిత షకీల్ బదాయూని కాంబినేషన్ లో తెరకెక్కిన దిలీప్ కుమార్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దిలీప్ నటనకు షకీల్ రచన తోడై, వాటికి నౌషద్ బాణీలు జతకట్టి ప్రేక్షకులను పరవశింప చేసిన తీరును ఎవరూ మరచిపోలేరు. ఈ త్రిమూర్తుల కలయికలో రూపొందిన చిత్రాలలో అధిక భాగం దిలీప్ కు మహ్మద్ రఫీ నేపథ్యగానం చేయడం విశేషం. కాగా, కొన్ని చిత్రాలలో ముకేశ్, తలాత్ మహ్మద్ సైతం దిలీప్ కు పాడారు.
నౌషద్, షకీల్ జోడీ దిలీప్ చిత్రాలకు ఇంద్రజాలం చేశాయనే చెప్పాలి. ఆ మాయాజాలం 1948లో ‘మేలా’ సినిమాతో మొదలయిందనీ చెప్పవచ్చు. ‘మేలా’లోని “యే జిందగీ కే మేలే…”, “గాయే జా గీత్ మిలన్ కే…”, “ధర్తీ కో ఆకాశ్ పుకారే…”, “మేరా దిల్ తోడ్నే వాలే…” అంటూ సాగే పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దిలీప్ ‘బాబుల్’ (1950)లోనూ నౌషద్, షకీల్ మరింతగా మాయచేశారనే భావించాలి. ఇందులోని “దునియా బదల్ గయీ…”, “కిసీ కే దిల్ మే రెహనా థా…”, “మేరా జీవన్ సాథీ బిచడ్ గయా…”, “హుస్న్ వాలో కో న దిల్ దో…” అని అలరించిన గీతాలు ప్రేక్షకులనూ కట్టి పడేశాయి. 1951లో ఇదే కాంబోలో తెరకెక్కిన ‘దీదార్’లోని “హువే హమ్ జిన్ కేలియే బర్బాద్…”, “నసీబ్ డర్ పే తేరా…”, “మేరీ కహానీ బూల్నే వాలే…” అనే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఇక జానపదంగా తెరకెక్కిన ‘ఆన్’ (1952) రంగుల చిత్రంలోని పాటలు యావద్భారతాన్నీ ఓ ఊపు ఊపాయి. “మాన్ మేరా ఎహ్ సాన్ అరే నాదాన్…”, “దిల్ మే చుప్కే ప్యార్ కా తూఫాన్…” వంటి పాటలతో పాటు మిగిలిన గీతాలు అలరించాయి.
దిలీప్ కుమార్ హీరోగా 1955లో షాద్ నిర్మించి, సంగీతం సమకూర్చిన ‘ఉరన్ ఖటోలా’కు షకీల్ మరపురాని సాహిత్యం సమకూర్చారు. ఇందులోని “ఓ దూర్ కే ముసాఫిర్…”, “న రో యే దిల్ కభీ రోనే సే…”, “న తూఫాన్ సే ఖేలో…” వంటి పాటలతో పాటు మిగిలిన గీతాలూ మురిపించాయి. దిలీప్ మరో జానపదం ‘కోహినూర్’ (1960)లోనూ నౌషద్, షకీల్ జోడీ మత్తు చల్లింది. “దో సితారో కా జమీన్ పర్ హై మిలన్…”, “కోయి ప్యార్ కే దేఖే జాదుగరీ…”, “మధుబన్ మే రాధికా నాచేరే…” వంటి పాటలను ఎవరు మాత్రం మరచిపోగలరు. అదే యేడాది విడుదలైన చారిత్రక చిత్రం ‘ముఘల్ ఏ ఆజమ్’లోనూ ఈ త్రిమూర్తుల కలయిక ఎంతగానో అలరించింది. ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ముఘల్-ఏ-ఆజమ్’ చిత్రం దాదాపు 15 సంవత్సరాలు చెక్కుచెదరని వసూళ్ళ రికార్డుతో నంబర్ వన్ ప్లేస్ లో నిలచింది. ఇందులోని ప్రతి ఒక్క పాట మధురమే! ఈ ముగ్గురికీ నచ్చిన గీతం లతా మంగేష్కర్ స్వరంలో జాలువారిన “మొహబ్బత్ కీ ఝూటీ…” అంటూ సాగే పాట. 1961లో రూపొందిన ‘గంగ-జమున’లోని “నైన్ లడ్ జాయీ హై…”, “ఓ ఛలియా రే…”, “ఇన్సాఫ్ కీ దగర్ పే…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ‘లీడర్’ (1964)లోని “ముఝే దునియ వాలో షరాబీ న సంఝో…”, “అజ్ కల్ షౌక్ ఏ దీదార్ హై…”, “అప్నీ ఆజాదీ కో హమ్…”, “హమీమ్ సే మొహబ్బత్…” వంటి పాటలు భలేగా అలరించాయి. యన్టీఆర్ ‘రాముడు-భీముడు’ ఆధారంగా హిందీలో దిలీప్ ద్విపాత్రాభినయం చేసిన ‘ రామ్ ఔర్ శ్యామ్’ చిత్రానికి సైతం షకీల్ సాహిత్యానికి తగ్గ బాణీలు కట్టి నౌషద్ మురిపించారు. ఇందులోని “ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లే లే…”, “ఆయీ హై బహారే…”, “మై హూ సాకీ…”, “ప్యార్ కీ తండీ ఆగ్ మే…” వంటి పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. శివాజీగణేశన్ ‘ఆలయమణి’ ఆధారంగా యన్టీఆర్ ‘గుడిగంటలు’ తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలను కలిపి దిలీప్ తో హిందీలో ‘ఆద్మీ’ రూపొందింది. ఇందులోని పాటలన్నీ ఓ ఎత్తు… రఫీ గళంలో జాలువారిన “ఆజ్ పురానీ రాహోం సే…” అంటూ సాగే గీతం ఒక్కటీ మరో ఎత్తు అని చెప్పవచ్చు. మిగిలిన పాటలూ ఎంతగానో మురిపించాయి.
దిలీప్, నౌషద్, షకీల్ కాంబోలో రూపొందిన అన్ని చిత్రాలూ అఖండ విజయం సాధించలేదు. 1954లో తెరకెక్కిన ‘అమర్’లోని పాటలు అలరించినా, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే 1966లో వచ్చిన ‘దిల్ దియా దర్ద్ లియా’ కూడా అంతగా అలరించలేక పోయింది. 1968లో తెరకెక్కిన ‘సంఘర్ష్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోగా, పాటలూ అంతగా మురిపించలేదు. దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపిన ఘనత నౌషద్ సంగీతానికి, షకీల్ సాహిత్యానికి దక్కుతుందని చెప్పవచ్చు. ట్రాజెడీ అనగానే బెంగాలీ నవల ‘దేవదాసు’ను గుర్తు చేసుకుంటారు. అలాగే హిందీలో రెండో సారి రూపొందిన ‘దేవదాస్’లో దిలీప్ టైటిల్ రోల్ పోషించారు. చిత్రమేమిటంటే, ఈ సినిమాకు నౌషద్ కానీ, షకీల్ కానీ పనిచేయలేదు. 1955లో రూపొంది దిలీప్ కు నటునిగా ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘దేవదాస్’కు సాహిర్ లుదియాన్వీ పాటలు రాయగా, ఎస్.డి.బర్మన్ స్వరకల్పన చేశారు. ఏది ఏమైనా దిలీప్ కుమార్ నటన గుర్తుకు రాగానే నౌషద్ సంగీతం, ఆ వెనువెంటనే షకీల్ బదాయూనీ సాహిత్యం ప్రేక్షకులకు గుర్తుకు వస్తూనే ఉంటుంది.