Dil Raju: గుణ టీమ్ వర్క్ పతాకంపై నీలిమా గుణ నిర్మించిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పకునిగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఏప్రిల్ 14న ఐదు భాషల్లో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కాబోతోంది. సమంత టైటిల్ రోల్ పోషించిన ‘శాకుంతలం’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం ప్రసాద్స్ లోని బిగ్ స్క్రీన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో పాటు ప్రేక్షకుల కోసం త్రీడీ వర్షన్ ట్రైలర్ ను ప్రదర్శించారు.
అనంతరం ఈ చిత్రంలో పాటలు రాసిన చైతన్యప్రసాద్ మాట్లాడుతూ, ‘గుణశేఖర్ గారి చిత్రానికి పాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ఇందులో రెండు అద్భుతమైన పాటలు రాశాన’ని తెలిపారు. ఈ చిత్రాన్ని ఎడిటింగ్ చేసిన ప్రవీణ్ పూడి దర్శక నిర్మాతల సహకారానికి ధన్యవాదాలు చెప్పారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్ లో తొలిసారి తాను వర్క్ చేశానని, అలానే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు పని చేసే అవకాశాన్ని కూడా ఆయన ఇచ్చారని, కాళిదాస విరచిత ‘శాకుంతలం’ను గుణశేఖర్ దృశ్య కావ్యంగా మలిచారని మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ తెలిపారు. ఈ చిత్రాన్ని త్రీడీలో తీసుకు రావాలనే ఆలోచన ‘దిల్’ రాజు గారిదేనని, ఆయన కారణంగానే నిర్మాణ వ్యవహారాలు సాఫీగా సాగిపోయాయని నిర్మాత నీలిమా గుణ చెప్పారు.
చిత్ర సమర్పకులు ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘అందరూ అనుకుంటున్నట్టు గుణశేఖర్ కు చేయూతనివ్వడానికి తాను ఈ ప్రాజెక్ట్ లోకి రాలేదని, తన స్వార్థంతోనే వచ్చాన’ని తెలిపారు. ఇంతవరకూ యాభై చిత్రాలను నిర్మించినా, వాటిల్లో వి.ఎఫ్.ఎక్స్. కు పెద్దంత ఆస్కారం లేకపోయిందని, అలానే పాన్ ఇండియా స్థాయి మూవీని కూడా తాను ఇంతవరకూ నిర్మించలేదని, ఆ రెండు ఎక్స్ పీరియన్స్ ను పొందడానికే తాను ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిని అయ్యానని చెప్పారు. ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత తన సోదరుడు శిరీష్ దీనిని త్రీడీలోకి కన్వర్ట్ చేస్తే బాగుంటుందనే సలహా ఇచ్చాడని, పిల్లలతో పాటు కుటుంబ సమేతం వచ్చే ఈ సినిమాకు త్రీడీ అనేది అదనపు అర్హత అవుతుందని భావించామని తెలిపారు. ఈ యేడాది తమ బ్యానర్ నుండి వచ్చిన ‘వారసుడు, బలగం’ చిత్రాలను ఆదరించినట్టే ‘శాకుంతలం’నూ ఆదరించాలని ఆయన కోరారు. ‘దిల్’ రాజు లాంటి మేకర్ ఉండబట్టే నిర్మాణ పరంగా ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా, తాను పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ మీద దృష్టి పెట్టానని, ఇది సమంత ‘శాకుంతలం’ అని, ఆమె టైటిల్ రోల్ కు ప్రాణప్రతిష్ఠ చేశారని గుణశేఖర్ కితాబిచ్చారు. తాను గతంలో ‘రుద్రమదేవి’ తీసినప్పుడు సంపూర్ణ సహకారం అందించి, అందులో గోనా గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్, ఈ సినిమాలో చిన్నారి భరతుడిగా నటించడానికి తన కుమార్తె అర్హాను పంపారని కితాబిచ్చారు.
సమంత డుమ్మా!
‘శాకుంతలం’ త్రీడీ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సమంత హాజరు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. దాంతో ట్రైలర్ లాంచ్ కు గంట ముందే ప్రసాద్స్ బిగ్ స్క్రీన్ కిక్కిరిసిపోయింది. అందులో అత్యధికులు సమంతను చూడొచ్చని వచ్చిన వాళ్ళే! కానీ సమంత ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలియగానే వాళ్లంతా నిరుత్సాహపడిపోయారు. ‘దిల్’ రాజు స్పీచ్ మొదలు పెట్టగానే ‘సార్… సమంత ఎందుకు రాలేదు? ఆమె వస్తుందని చెప్పి మమ్మల్ని మోసం చేశారు’ అంటూ కొందరు కామెంట్ చేశారు. వాళ్ళను శాంతింప చేయడానికి ‘దిల్’ రాజు చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన ‘దిల్’ రాజు… ‘అదిగో ఆ మూల సమంత మేనేజర్ ఉన్నారు. అతన్నే అడగండి’ అని చెప్పారు. సమంత కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేపోయారని, అయినా ఆమె మనసంతా ఇక్కడే ఉందని నిర్మాత నీలిమా గుణ సర్థిచెప్పారు. సమంతను మీరే కాదు… ఇక్కడకు రాకపోవడంతో నేనూ మిస్ అవుతున్నానని గుణశేఖర్ సరదాగా వ్యాఖ్యానించారు.