Dil Raju Revealed Bimbisara OTT Release Date: సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారంలో భాగంగా.. ఓటీటీ రిలీజ్ విషయంలో కొన్ని మార్పులు చేపట్టనున్నట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇదివరకే వెల్లడించింది. ఇంతకుముందు లాగా రెండు వారాలు లేదా నాలుగు వారాల్లోనే రిలీజ్ చేయకుండా.. కనీస వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఓటీటీలో వచ్చేలా కొత్త రూల్స్ తీసుకొస్తామన్నారు. దీంతో.. గత శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతాయన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడా మిస్టరీకి తెరదించుతూ.. ‘బింబిసార’ను ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న విషయంపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాత ‘బింబిసార’ సినిమా ఓటీటీల విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ లెక్కన.. సెప్టెంబర్ 23వ తేదీన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవ్వొచ్చు. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. రెండు నెలల నుంచి సినిమాలు ఆడక చతికిలపడ్డ బాక్సాఫీస్‌కి ఈ చిత్రం ఊపిరి పోసింది. అంతేకాదు.. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న కళ్యాణ్ రామ్ కెరీర్‌కి కూడా ఈ చిత్రం మెరుగులు దిద్దింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ చిత్రం సక్సెస్ అందించడంతో.. ముందుగా ప్రకటించినట్టు ‘పార్ట్ 2’పై మేకర్స్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
కొత్త దర్శకుడు వశిష్ట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కే. హరికృష్ణ నిర్మించారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కేథరీన్ తెరిసా, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు. ఇందులో కళ్యాణ్ రామ్ క్రూరమైన త్రిగర్తల సామ్రాజ్యాధిపతిగా కనిపించారు. టైమ్ ట్రావెల్ చేసి, ప్రస్తుత కాలంలో తన తప్పులు తెలుసుకొని, ఆ రాజు మంచి వ్యక్తిగా ఎలా మారాడన్న అంశాలతోనే ఈ సినిమా కథ సాగుతుంది.