‘కార్తికేయ -2’ మూవీ సక్సెస్ మీట్ లో గత కొన్ని రోజులుగా చిత్రసీమలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పలు సందేహాలకు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఒక్కొంత ఆవేశంగా వివరణ ఇచ్చారు. కొన్ని వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానెల్స్ తమ క్లిక్స్ కోసం, సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడం కోసం తనను టార్గెట్ చేస్తున్నాయని, తన పేరు ఉంటే జనాలు వాటిని క్లిక్ చేసి చూస్తారనే స్వార్థంతో నిజానిజాలు తెలుసుకోకుండా తనను విమర్శిస్తున్నాయని ఆయన అన్నారు. ‘కార్తికేయ -2’ సినిమాను ప్రారంభం నుండి ఈ టీమ్ ఎంత కష్టపడిందో తనకు తెలుసని ‘దిల్’ రాజు అన్నారు. నిఖిల్ తొలి చిత్రం ‘హ్యాపీడేస్’, సోలో హీరోగా నటించిన ‘యువత’ సమయం నుండి తాను అతనికి సహకారం అందిస్తున్నానని అన్నారు. అలానే చందూ మొండేటి తొలి చిత్రం నుండి తనకు పరిచయం ఉందని చెప్పారు. ఈ సక్సెస్ మీట్ లో తనపై ఉన్న ప్రచారానికి వివరణ ఇవ్వడం సబబు కాకపోయినా… చెప్పకతప్పడం లేదని ‘దిల్’ రాజు అన్నారు.
”జూలై 5న తమ ‘థ్యాంక్యూ’ మూవీని విడుదల చేయాలని అనుకున్నామని, కానీ అనుకున్న సమయంలో వర్క్ పూర్తి కాకపోవడంతో ‘కార్తికేయ -2’ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో మాట్లాడి, 22వ తేదీకి తాము వద్దామని అనుకుంటున్న విషయాన్ని చెప్పానని అన్నారు. ఆయన హీరో, డైరెక్టర్ తో మాట్లాడి చెబుతానన్నారని ‘దిల్’ రాజు చెప్పారు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన నిఖిల్, చందూ మొండేటి 22వ తేదీ నుండి తమ చిత్రాన్ని వేరే డేట్ కు మార్చుకోవడానికి అంగీకరించారని, వారికి తాను ఎప్పుడు విడుదలకు వచ్చినా సహకరిస్తానని మాట ఇచ్చాన’ని అన్నారు.
అయితే ఆగస్ట్ 5న వాళ్ళు సినిమాను విడుదల చేయాలనుకునేటప్పటికే ‘బింబిసార, సీతారామం’ చిత్రాలు ఆ తేదీకి వస్తుండటంతో 12వ తేదీకి వెళ్ళారని ‘దిల్’ రాజు వివరించారు. కానీ ఆ రోజు కూడా మరో సినిమా ఉండటంతో తాను ఒక రోజు ముందుకో, వెనక్కో వెళ్ళమని సలహా ఇచ్చారని, అంతకు మించి వారి మీద ఎలాంటి ఒత్తిడి చేయలేదని ‘దిల్’ రాజు అన్నారు. ఆ ప్రకారంగా వారు ఈ సినిమాను 13వ తేదీ రిలీజ్ చేశారని చెప్పారు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా, వివరణ ఎవరినీ అడక్కుండా… ఎవరికి వారు తమకు తోచిన విధంగా రాసేశారని, తనను బలిపశువును చేసే ప్రయత్నం చేశారని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకూ తాను ఇలాంటి విషయాలలో మౌనంగానే ఉంటానని, కానీ మరీ బాధ్యతారాహిత్యంగా కొందరు వ్యవహరించడం బాధను కలిగించిందని అన్నారు.
ఇలాంటివి రాసేవారు, వినేవారు, చదివేవారు కాస్తంత కామన్ సెన్స్ ఉపయోగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా… ఓ సినిమా హిట్ అయితే మొదట సంతోషించేది తానేనని, ఇక్కడ అసలు ఎవరూ ఎవరి సినిమానూ తొక్కేయాలని చూడరని దిల్ రాజు చెప్పారు. ‘బింబిసార’ నైజాంలో వీకెండ్ లో వసూలుచేసిన మొత్తాన్ని ‘కార్తికేయ -2’ చిత్రం ఎన్నో పోటీ చిత్రాల నడుమ, తక్కువ థియేటర్లతోనే సాధించిందని, ఏ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. పీపుల్స్ మీడియా సంస్థ చాలా పెద్దదని, ఆ బ్యానర్ లో ఇప్పుడు ఎనిమిది సినిమాలు నిర్మాణం అవుతున్నాయని, అలాంటి ఓ సంస్థ తీసిన సినిమాను తాను తొక్కేశానని ప్రచారం చేయడం అర్థరహితమని ‘దిల్’ రాజు అన్నారు.
‘కార్తికేయ -2’ చిత్రం విడుదల పలు మార్లు వాయిదా పడటం వెనుక ఉన్న అసలు కారణాలు, వివరాలను ‘దిల్’ రాజు మీడియా ముఖంగా తెలిపి, తన మనసులోని బాధను ఈ సక్సెస్ మీట్ ద్వారా కొంత తగ్గించుకున్నట్టు అయ్యింది!