Dil Raju Emotional over Allegations on him about Sankranthi Releases: గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఏదో ఒక వివాదం తెర మీదకు రావడం కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఏడెనిమిదేళ్ళ నుంచి చూస్తుంటే ఖచ్చితంగా ఈ వివాదంలో దిల్ రాజు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా దిల్ రాజు పేరు సంక్రాంతి సినిమాల రిలీజ్ వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి దిల్ రాజు స్వయంగా సినిమా రిలీజ్ చేయడం లేదు. కానీ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాని నైజాం ఉత్తరాంధ్ర ప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే మిగతా సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు, దాని వెనక దిల్ రాజే ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే విషయం మీద దిల్ రాజు ఓపెన్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా దిల్ రాజు ఎమోషనల్ అవుతూ గద్గద స్వరంతో మీడియాలో కొన్ని వెబ్ సైట్స్ కు వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. ఒక చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు సంక్రాంతి సమయంలో తన మీద ఒక వర్గం చేస్తున్న దాడిపై ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. నిన్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారని దిల్ రోజు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, అతను ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాడు అని చెబితే కొన్ని వెబ్ సైట్స్ వారు దానిని వక్రీకరించి ఈరోజు రాశారని ఆయన పేర్కొన్నారు.
Dil Raju: ఇప్పటిదాకా ఊరుకున్నా ఇక నా జోలికి వస్తే తాట తీస్తా… వారికి దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్
అవి రెండూ ప్రముఖ వెబ్ సైట్స్ అని పేర్కొన్న దిల్ రాజు మీరు మీ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి వేరే వాళ్ళ పేర్ల మీద తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారని వారిని ప్రశ్నించారు. మీకు ఇది అవసరమా అని ప్రశ్నించిన ఆయన దిల్ రాజు ఏమీ అనడు ప్రశ్నించడు, సాఫ్ట్ గా వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? అయితే ఇక మీదట మాత్రం తాటతీస్తా అంటూ ఫైర్ అయ్యారు. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు ఇదంతా? కూల్ గా ఉన్నామని అనుకుంటుంటే అసలు సంబంధం లేకుండా నా పేరు లాగుతున్నారు అని అన్నారు. పోనీ ఆ నిర్మాత ఏమైనా వచ్చి మీ దగ్గర మాట్లాడారా? అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ నిర్మాతను నన్ను ఇదే స్టేజి మీద కూర్చోబెట్టి మాట్లాడించండి అని దిల్ రాజు పేర్కొన్నారు. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేస్తున్నారు? వ్యాపార పరంగా వచ్చే కొన్ని తేడాలను కొన్ని వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ వాడుకుంటున్నాయి, అది 100% తప్పని అన్నారు. మొన్న ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాల గురించి ఛాంబర్ లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి బరి నుంచి వెనక్కి పంపించామని అది ఎంత కష్టమో మాకు తెలుసు అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. అయితే మీడియా ముందు ఎప్పుడూ సరదా సరదాగా కనిపిస్తూ ఉండే దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో మాత్రం గద్గద స్వరంతో కన్నీటి పొరలతో కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం దిల్ రాజుని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని ఇలా టార్గెట్ చేసి ఇబ్బంది పెడితే ఎవరైనా ఇలానే బరస్ట్ అవ్వక తప్పదని అంటున్నారు.