Dhruv Sarja Bharjari Movie Releasing In Telugu As Pushparaj The Soldier: ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్జరి’. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘పుష్పరాజ్ ది సోల్జర్’ పేరుతో బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత ఆగస్ట్ 19న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆగస్టు 27కు మార్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై, మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్, దర్శకుడు సూర్య కిరణ్, ఆదిత్య, తిరుపతి రెడ్డి , రేణుక, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ, ”’క్రేజీ అంకుల్స్’ తరువాత మేం తీసిన స్ట్రెయిట్ ఫిలిం ‘గోల్డ్ మ్యాన్’. ఆ సినిమా పది రోజుల షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉంది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, రవీంద్ర కళ్యాణ్ కే క్రెడిట్ మొత్తం దక్కుతుంది. అతనే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు” అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ధ్రువ సర్జా నటించిన ‘పొగరు’ సినిమా తెలుగులో బాగా ఆడిందని, అతన్ని చూస్తుంటే, అతని మేనమావ అర్జున్ ‘మా పల్లెలో గోపాలుడు’ టైమ్ లో ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడని, అలాగే హీరోయిన్ హరిప్రియ ‘పిల్ల జమిందార్’తో పాటు బాలకృష్ణతో ‘జై సింహ’లో నటించి మంచి విజయాన్ని అందుకుంద’ని చెప్పారు. ఈ సినిమాకు తెలుగులో ‘పుష్పరాజ్’ అనే టైటిల్ పెట్టడంతోనే యాభై శాతం విజయం దక్కిందని, ట్రైలర్ ఎక్సట్రార్దినరీ ఉందని, డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ సినిమా అనిపించేలా ఉంద’ని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.