Dhostan: సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దోస్తాన్’. ఎ. సూర్య నారాయణ స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మించారు. ఈ మూవీ టీజర్ ను బుధవారం ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఆవిష్కరించారు. నూతన నటీనటులతో, స్నేహం నేపథ్యంలో సూర్యనారాయణ అక్కమ్మగారి తెరకెక్కించిన ఈ సినిమా చక్కని విజయం సాధించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. కదిరిలో ఉండే సూర్యనారాయణ, అన్నవరంలోని సిద్ స్వరూప్ తో ఈ సినిమాను వైజాగ్, రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరించారని, వారి స్నేహానికి ఇదే గొప్ప తార్కారణమని మరో అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ కితాబిచ్చారు. ఫ్రెండ్ షిప్ మీద తెరకెక్కిన ‘దోస్తాన్’… ‘ప్రేమదేశం’ అంతటి విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను నిర్మాత పద్మిని నాగులపల్లి వ్యక్తం చేశారు. చక్కని ప్లానింగ్ తో తీసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని మూసా అలీఖాన్ కోరుకున్నారు. తన భార్య కోరిక మేరకే తానీ చిత్రాన్ని తీశానని, మంచి కథల కోసం వెతికితే ఏవీ నచ్చలేదని, ఆ సమయంలో సిద్ స్వరూప్ చెప్పిన ఈ కథ ఎంతో నచ్చిందని దర్శక, నిర్మాత సూర్యనారాయణ తెలిపారు. ఈ సినిమా విజయంపై తమకు గట్టి నమ్మకం ఉందని, ఎంతో కష్టపడి ఈ చిత్రాలో నటించామని సిద్ స్వరూప్, కార్తికేయ, ప్రియ వల్లభి చెప్పారు. తమకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.