ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్ చేయకండి..” అంటూ సాగుతున్నారు. అలా అలరించిన ‘ఢీ’ సినిమా హీరో మంచు విష్ణు కెరీర్ లో ఫస్ట్ హిట్ అని చెప్పాలి. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా ఈ సినిమా ఓ టర్నింగ్ అనాలి. 2007 ఏప్రిల్ 13న విడుదలైన ‘ఢీ’ అలా మరికొందరికీ మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.
‘ఢీ’ కథలోకి తొంగి చూస్తే – తండ్రి సంపాదనతో కులాసాగా తిరుగుతూ ఉంటాడు శ్రీనివాసరావు. అతని ముద్దు పేరు బబ్లూ. కొడుకును దారిలో పెట్టడానికి బబ్లూ తండ్రి అతణ్ణి శంకర్ గౌడ్ అనే పేరు మోసిన గూండా దగ్గర క్లర్క్ గా చేర్పిస్తాడు. శంకర్ గౌడ్ చెల్లెలు పూజ, బబ్లూ ప్రేమించుకుంటారు. శంకర్ గౌడ్ కు చెల్లెలంటే ప్రాణం. అతనికి నగరంలో భల్లూ అనే మరో రౌడీతో శత్రుత్వం ఉంటుంది. వాడి తమ్ముణ్ణి శంకర్ చంపేస్తాడు. దాంతో శంకర్ ను వేసేయాలని భల్లూ ఎదురుచూస్తూ ఉంటాడు. శంకర్ ను తన ఐడియాలతో ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటూ ఉంటాడు బబ్లూ. శంకర్ తన చెల్లెలిని అమెరికాలో తమ కుటుంబానికి బాగా కావలసిన డాక్టర్ కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అయితే ఆ డాక్టర్ కు బబ్లూ, పూజ ప్రేమకథ తెలుస్తుంది. అతనే ఓ ప్లాన్ ప్రకారం పూజతో తన పెళ్ళి జరగకుండా చూస్తాడు. తరువాత బబ్లూ, పూజ పెళ్ళి చేసుకుంటారు. ఆ విషయం శంకర్ గౌడ్ కు తెలియకుండా మేనేజ్ చేస్తారు. ఎవరి ఇళ్ళలో వారు ఉంటారు. తన చెల్లెలు ఎవరినో ప్రేమించిందన్న విషయం శంకర్ కు అర్థమవుతుంది. వాడు బబ్లూయే అని తెలుసుకోలేడు. ఓ సారి శంకర్ గౌడ్ నమ్మినబంటు చేసిన మోసం కారణంగా శంకర్ గౌడ్, పూజపై భల్లూ మనుషులు దాడి చేస్తారు. నమ్మకద్రోహం చేసినవాడిని, ఇతరులను శంకర్ గౌడ్ చంపేస్తాడు. అయితే భల్లూ మనుషులు పూజను కిడ్నాప్ చేస్తారు. ఆ విషయం తెలిసిన శంకర్ గౌడ్ తల్లడిల్లి పోతాడు. ఆమెను ఎక్కడ బంధించారో తెలియదు. అయితే పూజ మణికట్టు కోసేసి, ఆమెకు భల్లూ ఓ ఫోన్ ఇచ్చి దమ్ముంటే నీ చెల్లెలిని కాపాడుకో అని సవాల్ చేస్తాడు. ఆ ఫోన్ సహాయంతో బబ్లూ పూజ ఆచూకీ తెలుసుకొని, ఆమెను రక్షిస్తాడు. భల్లూను శంకర్ చంపబోతే, తన కారణంగా ఓ మనిషి చావడం తనకు ఇష్టం లేదని పూజ తన అన్నను ఆ ప్రయత్నం విరమింప చేస్తుంది. తాను చావు బతుకుల్లో ఉన్నా తనను ప్రేమించినవాడు పట్టించుకోలేదని, అదే బబ్లూ తన ప్రాణాలకు తెగించి తనను రక్షించాడని అన్నతో చెబుతుంది పూజ. అప్పటికే పూజ నెలతప్పిందనే అబద్ధం చెబుతారు. దాంతో తనంటే ఎంతో గౌరవించే బబ్లూకే పూజను ఇచ్చి పెళ్ళిచేస్తారు. వారికి పది నెలల తరువాత ఓ పండంటి బాబు పుడతాడు. పెళ్ళికాక ముందే మూడో నెల ఉంటే, పెళ్ళయిన పది నెలలకు ఎలా బిడ్డ పుట్టాడో తెలియక తికమక పడతాడు శంకర్. దాంతో కథ ముగుస్తుంది.
‘ఢీ’ చిత్రంలో బబ్లూగా మంచు విష్ణు, పూజగా జెనీలియా, శంకర్ గౌడ్ గా శ్రీహరి, చారిగా బ్రహ్మానందం నటించారు. మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్, ఢిల్లీ రాజేశ్వరి, జయప్రకాశ్ రెడ్డి, సుప్రీత్, బ్రహ్మాజీ, సునీల్, అజయ్, సుమ, తనికెళ్ళ భరణి, ప్రేమ, షఫి, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, చిత్రం శ్రీను నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు కోన వెంకట్ సమకూర్చగా, గోపీమోహన్ కథావిస్తరణ చేశారు. శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాహితి, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కందికొండ, చిన్నిచరణ్ పాటలు పలికించారు. చక్రి సంగీతం సమకూర్చారు. మల్లిడి సత్యనారాయణ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని “కనుపాపకు ఇది తెలుసా..”, “కొంచెం కొంచెం..”, “తోడాసా ఉల్లాసం..”, “ఏ మాయో మాయో..” వంటి పాటలు అలరించాయి.
ఈ సినిమా మంచి విజయం సాధించింది. శతదినోత్సవం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్లకు, బెస్ట్ ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ కు నంది అవార్డులు లభించాయి. ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ: డబుల్ డోస్’ అనే పేరుతో మంచు విష్ణు హీరోగానే సీక్వెల్ తీస్తున్నట్టు 2020లో శ్రీను వైట్ల ప్రకటించారు. మరి అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.