బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద నష్టంగా భావిస్తున్నారు.
1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్ సీన్లు, స్టైల్, డైలాగ్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్న ఆయనకు ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’, ‘యాక్షన్ కింగ్’ వంటి బిరుదులు లభించాయి. ‘షోలే’లో వీరూ పాత్ర ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ఇంటి పేరుగా మారారు. డ్రీమ్ గర్ల్, లోఫర్, దోస్త్, మేరా నామ్ జోకర్ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు.
సినీ సేవలకు గాను ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర, 2012లో పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన భార్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని. కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్‌లో ప్రముఖ నటులు. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించిన ధర్మేంద్ర మృతి సినీ ప్రపంచాన్ని తీవ్రంగా విచారంలో ముంచేసింది.
'ధర్మేంద్ర మరణ వార్త నన్ను కలిచివేసింది. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన భారతీయ సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి' అన్నారు జూనియర్ ఎన్టీఆర్
ధర్మేంద్ర కేవలం దగ్గజ నటుడు మాత్రమే కాదు. ఒక అద్భుతమైన వ్యక్తి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారి ఆయన వ్యక్తిత్వం నా హృదయాన్ని లోతుగా తాకింది. ఆయనతో నేను పంచుకున్న స్నేహ పూర్వక విషయాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మన మధ్య లేనందుకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కు సంతాపం తెలియజేస్తున్నా. ఆయన లక్షలాది మంది హృదయాలలో బతికే ఉంటారు అన్నారు చిరంజీవి.
‘‘దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడు అయిన ధర్మేంద్రను ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది. ఆయర మరణం మనకు తీరని లోటు. ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
‘‘ధర్మేంద్ర మరణ వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన బాలీవుడ్ లో దిగ్గజ నటుడు. తన అప్రతిహత నటనతో కోట్లాది మంది మనసుగు గెలిచారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
'అరవై వేళ్లకు పైగా తన నటనతో ఎంతో మెప్పించారు. తన అత్యుత్తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరనిలోటు. ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. ఆయన పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అన్నారు అమిత్ షా.
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర కొన్ని గంటల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే కదా. ఆయన మరణంతో బాలీవుడ్ ప్రముఖులు అందరూ ముంబైలోని జాహు రెసిడెన్సీకి క్యూ కడుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటులు, హీరోలు, దర్శకులు వస్తున్నారు. కాసేపటి క్రితమే ధర్మేంద్ర మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొచ్చారు. ఆయన మరణాన్ని కుటుంబం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ధర్మేంద్ర మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. భారత చలనచిత్ర పరిశ్రమకు ధర్మేంద్ర మృతి భారీ నష్టం అన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన ఆయన, దశాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనబర్చారని.. కళాకారులను ప్రేమించాలనే ఆలోచనను పెంచారన్నారు ముర్ము. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.
ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది. ఆయన ఒక దిగ్గజ సినీ వ్యక్తిత్వం, ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఆకర్షణ మరియు లోతును తెచ్చిన అద్భుతమైన నటుడు. ఆయన విభిన్న పాత్రలను పోషించిన విధానం లెక్కలేనన్ని మందిని ఆకట్టుకుంది. ధర్మేంద్ర జీ తన సరళత, వినయం, ఆప్యాయతకు సమానంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి. -మోడీ
1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర.. యాక్షన్ కింగ్, హీ- మ్యాన్ గా ధర్మేంద్రకు గుర్తింపు.. షోలే చిత్రం ధర్మేంద్ర కెరీర్లో పెద్ద మలుపు.. ఫిల్మ్‌ఫేర్, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ధర్మేంద్ర.. 300లకు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర..
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. ధర్మేంద్ర నివాసానికి వస్తున్న బాలీవుడ్ నటీనటులు.. ముంబై జూహూ నివాసానికి అంబులెన్స్.. క్రిమేటోరియం వద్ద వేచి ఉన్న కుటుంబ సభ్యులు.. ఇంకా అధికారిక ప్రకటన చేయని కుటుంబం..