Deputy CM Bhatti Vikramarka Comments at Gaddar Cine Awards Meeting: సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు ప్రపంచంలో శాసించే స్థాయికి ఎదగాలని అన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు. సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు. తెలంగాణ అంటేనే సాంస్కృతిక జీవనం. తెలంగాణ అంటేనే ఆట, పాట.. ఇక్కడ బాధ వచ్చిన సంతోషం వచ్చినా పాట ద్వారా వ్యక్త పరుస్తాము అని వివరించారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది… అందర్నీ అక్కున చేర్చుకొని, ప్రేమించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉంటుంది అన్నారు. అసమానతలు, వైరుధ్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు అని వివరించారు.
Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని డిప్యూటీ సీఎం అన్నారు. గద్దర్ ఒక లెజెండ్, ఒక శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదని, ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించాలని తెలిపారు. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో చూసిన గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు, ఆయనను అనుకరిస్తుంటారు తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపమని తెలిపారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారని అన్నారు. గద్దర్ మొదట విప్లవోద్యమ బాటలో అడవి బాట పట్టిన కాలక్రమమైన దేశంలోని అన్ని సమస్యలకు భారత రాజ్యాంగమే పరిష్కారమని భావించి దాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు.
అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు. అన్ని అవార్డుల తరహాలోనే అన్ని రంగాలకు గద్దర్ అవార్డులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. సినీ పరిశ్రమలో అందర్నీ గౌరవించుకోవాలి, ప్రతి అవార్డు గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని తెలిపారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి, ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్ ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కొద్దిరోజుల్లోనే కమిటీ మరో మారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీష్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.