December Is Lucky Season For Hollywood: మన తెలుగువారికి సినిమా సీజన్స్ అనగానే జనవరిలో సందడి చేసే సంక్రాంతి, ఏప్రిల్-మేలలో పలకరించే సమ్మర్, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పులకింపచేసే దసరా గుర్తుకు వస్తాయి. హాలీవుడ్ లో ఈ తరహా సీజన్ అంటే ‘క్రిస్మస్ సీజన్’ అనే చెప్పాలి. ఆ తరువాతే సమ్మర్ అలరిస్తుంది. డిసెంబర్ 1 మొదలు 31 దాకా నెల మొత్తంలో ప్రతి శుక్రవారం సినిమా సందడి చేయడానికి హాలీవుడ్ సిద్ధమవుతూ ఉంటుంది. ఇప్పటి దాకా వందలాది చిత్రాలు ఈ సీజన్ లో విడుదలై విజయభేరీ మోగించాయి. వరల్డ్ వైడ్ టాప్ టెన్ లో నంబర్ వన్ గా నిలచిన ‘అవతార్- మొదటి భాగం’ 2009 డిసెంబర్ 10న లండన్ లోనూ, మరో 8 రోజులకు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఇప్పుడు ‘అవతార్-2’ గా వస్తోన్న ‘ద వే ఆఫ్ వాటర్’ కూడా డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమయింది. అంతకుముందు ఈ చిత్రాల దర్శకుడు జేమ్స్ కేమరాన్ రూపొందించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘టైటానిక్’ కూడా 1997 డిసెంబర్ 19న జనం ముందు నిలచింది.
జేమ్స్ కేమరాన్ తో పాటు మరికొందరు హాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ చిత్రాలను డిసెంబర్ లోనే విడుదల చేసి విజయవిహారం చేశారంటే భలే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అశేషజనాన్ని విశేషంగా అలరించిన ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ సిరీస్ లో మూడు భాగాలూ డిసెంబర్ లోనే విడుదల కావడం విశేషం! ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ మొదటి భాగం ‘ద ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్’ 2001 డిసెంబర్ 19న విడుదల కాగా, రెండో భాగం ‘ద టూ టవర్స్’ 2002 డిసెంబర్ 18న ప్రేక్షకులను పలకరించింది. కాగా మూడో భాగం ‘ద రిటర్న్ ఆఫ్ ద కింగ్’ 2003 డిసెంబర్ 17న జనం ముందు నిలచింది. ఈ మూడు భాగాలూ బ్లాక్ బస్టర్స్ గా నిలవడం తెలిసిందే! ఇవే కాదు “స్టార్ వార్స్ ఎపిసోడ్స్” గా వచ్చిన వాటిలో ఏడు, ఎనిమిది ఎపిసోడ్స్ డిసెంబర్ లోనే వెలుగు చూశాయి. గత సంవత్సరం వచ్చిన ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’; 2017లో వచ్చిన ‘జుమాన్జీ’, ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’కు ప్రీక్వెల్స్ గా వచ్చిన “హాబిట్” సిరీస్ సైతం డిసెంబర్ లోనే విడుదలయ్యాయి.
బోరిస్ పాస్టర్ మాక్ రాసిన ‘డాక్టర్ జివాగో’ నవల ఆధారంగా డేవిడ్ లీన్ అదే టైటిల్ తో రూపొందించి, ఘనవిజయం సాధించిన చిత్రం 1965 డిసెంబర్ 22న ప్రేక్షకులను పలకరించింది. ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్, డేనీ డివిటో నటించిన ‘ట్విన్స్’ కూడా 1988 డిసెంబర్ 9న విడుదలై విజయఢంకా మోగించింది. ఆంగ్ లీ తెరకెక్కించిన ‘క్రౌచింగ్ టైగర్- హిడెన్ డ్రాగన్’ 2000 మేలోనే కొన్ని దేశాల్లో విడుదలైనా, ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న విడుదలై విజయవిహారం చేసింది. జేమ్స్ బాండ్ మూవీ ‘టుమారో నెవర్ డైస్’, మిక్స్ డ్ యానిమేటెడ్ మూవీ ‘లిటిల్ స్టువార్ట్’, హెయిస్ట్ కామెడీస్ ‘ఓసిన్స్ ఎలెవెన్, ఓసిన్స్ ట్వల్వ్’, భయానక చిత్రం ‘ది ఎగ్జార్సిస్ట్’, అడ్వంచర్ మాన్ స్టర్ మూవీ ‘కింగ్ కాంగ్’ వంటి సినిమాలు సైతం డిసెంబర్ లోనే జనం ముందు నిలచి వారి మనసులు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ‘అవతార్ – ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో అని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు జేమ్స్ కేమరాన్ కు అచ్చివచ్చిన నెల కాబట్టి డిసెంబర్ లో తప్పకుండా ‘అవతార్-2’ మునుపటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందనీ సినీ జనం ఆశిస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం!