నటి నివేదా థామస్ టాలీవుడ్ తో పాటు మలయాళ, తమిళ చిత్రపరిశ్రమల్లో పేరున్న నటి. తనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తను ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు జంతువుల హక్కుల కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వీడియోలో నివేదా ఆవు పాలు పితికి ఆ తర్వాత వాటితో కాఫీ తయారు చేశారు. దానికి ‘జాయ్’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. కొంత మంది జంతు ప్రేమికులు ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. ఫ్రైడేస్ ఫ్యూచర్ ఉద్యమ కార్యకర్త 16 ఏళ్ల దీప్సీ పీలా, ‘నివేత ఒక స్త్రీవాది. ఆమె జంతువుల కోసం నోరు విప్పాలి. వాటి పాలు పితికి లాభం పొందే హక్కు లేదు’ అన్నారు. మరో జంతు కార్యకర్త తేజ ‘పాడి, గొడ్డు మాంసం పరిశ్రమ వాతావరణ మార్పులకు మరియు జంతు దోపిడీకి ప్రధాన కారణాలు అవుతున్నాయి. మానవ వినియోగం కోసం అలా చేయటం అనారోగ్యకరమైన విషయం. వాటికి మద్దతు ఇవ్వడం బాధ్యతారాహిత్యం. ఈ వీడియోతో నివేద మాంసం, పాడి పరిశ్రమను గ్లామరైజ్ చేస్తోంది’ అన్నారు. అయితే ఈ విమర్శలపై నివేద స్పందన ఏమిటన్నది తెలియరాలేదు.