CPI Narayana: బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఈ షో పై ఘాటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే నాగార్జునపై నారాయణ కామెంట్స్ చేయడం, నాగ్ అందుకు స్పందిన్చాడం జరిగాయి. తాజాగా మరోసారి నారాయణ తన నోటికి పనిచెప్పాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో దానికి, బిగ్ బాస్ కు లింక్ పెట్టి ఘాటు ఆరోపణలు చేశారు. “ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమైన చర్య. ఏపీలో ప్రభుత్వం శాశ్వతం కాదు.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా పేర్లు మార్చుకుంటూ పోతే పరిస్థితి ఏంటి?.. గత ప్రభుత్వాలు తప్పు చేశాయి కాబట్టి ప్రతిపక్షం ఉన్నారు.. మీరు కూడా అదే తప్పు చేస్తామంటే.. చేసుకోండి ఆపే వాళ్ళు ఎవరూ లేరు. యువకులు నాలుగు కాలాలు ఉంటారనే మంచి సూచనలు చేస్తున్నాను.
ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు మహిళలకు గుండు కొట్టించడం సాంఘీక దురాచారం.. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. వ్యభిచారులు కాబట్టే గుండు కొట్టించామని చెబుతున్నారు. అలా అయితే బిగ్ బాస్ లోని వాళ్లకు గుండు కొట్టిస్తారా?.. నల్గొండ మహిళలు వ్యభిచారులు అన్నప్పుడు.. బిగ్ బాస్ షోలో ఉన్నది వ్యభిచారులు కాదా..?.. అంటే బిగ్ బాస్ లోని వాళ్లకు చప్పట్లు కొడతారు.. సామాన్య మహిళలకు గుండు కొడతారా?. వ్యభిచారులు అనే పదాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో నిషేధించింది. వారిని వ్యభిచారులు అనడం ముమ్మాటికీ తప్పే. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆగ్రహం వ్యక్తం చేసారు.