Tollywood: టాలీవుడ్‌లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది.
అయితే తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయని.. మరి తెలుగు రాష్ట్రాలలో తమిళ సినిమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటామని తమిళ డైరెక్టర్ సీమాన్ ప్రకటించాడు. వారసుడు సినిమా విషయానికి వస్తే దర్శక, నిర్మాతలు ఇద్దరూ తెలుగువారేనని.. హీరో మాత్రమే తమిళ నటుడు అని సీమాన్ వాపోయాడు. మరి వారసుడు సినిమాకు ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని నిలదీశాడు.
Read Also: Allari Naresh: ప్రీ రిలీజ్కు సిద్ధం.. ఇట్లు మీ మారేడుపల్లి ప్రజానీకం
ఇంత జరుగుతుంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని దర్శకుడు లింగుస్వామి ప్రశ్నించాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాషాపరంగా పరిశ్రమల మధ్య విద్వేషాలు వస్తాయన్నాడు. అయితే తాము తమిళ సినిమాలను అడ్డుకుంటామని చెప్పలేదని తెలుగు సినీ నిర్మాతల మండలి అంటోంది. తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే చెప్పామని వివరణ ఇస్తోంది. ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు. సినిమాలను ఎవరూ అడ్డుకోలేరని .. ఇది సాధ్యం కాదన్నారు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని.. సినిమాకు ఎల్లలు లేవని.. సౌత్, నార్త్ అనే విభేదాలు తొలగించామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అందరిదీ అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. కాగా వారసుడు సినిమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఈ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పిస్తారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.