R. Narayanamurthy: పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. దీని గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ”మా ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్ పూర్తి అయింది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ప్రస్తుత విద్యావ్యవస్థకు సంబంధించిన చిత్రమిది. యూనివర్సిటీ చదువులు పూర్తిచేసుకుని కెరీర్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని వస్తున్న యువతను ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే… లీకేజీలు కాటు వేస్తున్నాయి. ఇటీవలే 10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ సంఘటనలు మనం చూశాం. ఇలా జరిగితే… విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? క్లాస్ రూమ్ లో విద్యార్థులకు లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు చేస్తూ ఉంటే, రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కొట్టుకుంటూ ఊపిరి ఆడిక గింజుకుంటున్నాయి. ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగ వ్యవస్థ ఇలాగే నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి. ఈ అంశాలను ఈ చిత్రంలో చూపించాం” అని అన్నారు. ఆర్. నారాయణమూర్తితో పాటు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలోని పాటలను గద్దర్, నిస్సార్, మోటపలుకులు రమేశ్, వేల్పుల నారాయణ రాయగా, గద్దర్, సాయిచరణ్, గోస్కుల రమేశ్, పల్లె నరసింహం గానం చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.