ఏపీ తీర ప్రాంతాలను మొంథా తుపాను వణికిస్తోంది.. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మొంథా తీవ్ర తుఫాన్‌గా బలపడడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల వీస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ప్రజలు ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది.
మొంథా తుపాను ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాలకు హాలిడే ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఏపీలోని థియేటర్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలంగా లేదు, ప్రజలు ఎవరు బయటకు రావద్దు, సినిమా ప్రదర్శనలను తుఫాను తగ్గేవరకు మూసివేస్తున్నామని ప్రకటించాయి థియేటర్స్ యాజమాన్యాలు. కాకినాడ, విశాఖపట్నం వంటి ఏరియాలలో తీవ్ర వర్షం కారణంగా థియేటర్స్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ మూసివేసేందుకు నిర్ణయించారు. అయితే తెలంగాణాలో మాత్రం మొంథా తఫాను ప్రభావం అంతగా లేదు. చెదురు మొదురు వర్షాలు తప్ప తీవ్ర వర్షాలు అయితే లేవు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడి థియేటర్స్ లో యథాతదంగా రన్ అవుతున్నాయి. ఏపీలో తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేంతవరకు ముఖ్య జిల్లాలలో ప్రదర్శనలు నిలిపివేయనున్నారు.