సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జీ ఈ చిత్రం డిజిటల్ హక్కులను పొందింది. దీంతో సల్మాన్ ‘రాధే’ను విడుదల చేసినట్టుగా పే-పర్-వ్యూ బేస్ లో ‘రిపబ్లిక్’ విడుదలకు ప్రణాళికలు వేస్తున్నారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం హక్కులను రికార్డు రేటుకు జీ స్టూడియోస్‌కు విక్రయించినట్లు తెలిసింది. “రిపబ్లిక్” డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ హక్కులు, థియేట్రికల్ రైట్స్… ఇలా అన్నిటికీ కలిపి రూ.40 కోట్ల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి నిర్మాతలకు ఇది లాభాల్ని తెచ్చే డీల్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో సాయి తేజ్ చిత్రానికి వచ్చిన ఫ్యాన్సీ రేట్ ఇదేనని అంటున్నారు. “రిపబ్లిక్” థియేట్రికల్ ఆదాయంలో, సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు వచ్చే లాభాలలో 18 శాతం వాటా నిర్మాతలు తీసుకోనున్నట్టు డీల్ కుదుర్చుకున్నారట. దీంతో నిర్మాతలు భగవాన్, పుల్లా రావు ఈ చిత్రం విడుదలకు ముందే లాభాలు సాధించినట్టు.