ప్రముఖ దర్శకులు వంశీ రూపొందించిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా అప్పట్లో విశేషాదరణ పొందింది. దాంతో ఆ పేరును చాలా మంది చాలా రకాలుగా వాడేసుకున్నారు. విశేషం ఏమంటే… దర్శకులు వంశీ బేసికల్ గా మంచి రచయిత. తెలుగు సాహితీ రంగంలో వంశీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాను రాసిన నవలలనే ఆయన సినిమాలుగానూ తీశారు. అలానే ఇప్పటికే వంశీ పలు నవలలు, కథా సంపుటాలను వెలువరించారు. గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న వంశీ… రచనను మాత్రం విడిచిపెట్టలేదు. స్వాతి వార పత్రికలో ‘పొలమారిన జ్ఞాపకాలు’ శీర్షికన వంశీ తన జీవితంలో తారస పడిన కొందరు వ్యక్తులకు సంబంధించిన విశేషాలను కథల రూపంలో రాశారు. మరీ ముఖ్యంగా సినిమా రంగంలోని లబ్దప్రతిష్ఠులతో పాటు, అవకాశాల కోసం చెన్నయ్ చేరిన సగటు వ్యక్తుల జీవితాలను వంశీ కథలుగా మలిచారు. తనదైన శైలిలో వంశీ రాసిన ఈ ‘పొలమారిన జ్ఞాపకాలు’ కథలు విశేష ఆదరణ పొందాయి. వీటిని సాహితీ ప్రచురణలు పుస్తక రూపంలో తీసుకొస్తోంది.
అందరికీ భిన్నంగా వంశీ!
దర్శకుడు వంశీ ప్రతి విషయాన్ని భిన్నంగా ఆలోచిస్తారు. పాఠకులు లేదా ప్రేక్షకుల ముందు తన మనసులోని భావాన్ని ఆవిష్కరించాలని అనుకున్నప్పుడు కొత్తగా ఎలా చూపగలం? ఎలా చెప్పగలం? అని మదన పడతారు. అందుకే ఆయన చిన్న పనిచేసినా అందులో గొప్ప సృజనాత్మకత దాగి ఉంటుంది. ఉదాహరణకు ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకాన్నే తీసుకుంటే… దాదాపు యాభైకు పైగా కవర్ పేజీలను ఆయన తయారు చేశారు. తాజా సాంకేతికతను అందిపుచ్చుకుని అతి వేగంగా తన మనసులోని ఆలోచనలను అందంగా ఆయన కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలరు. పైగా వంశీలో మంచి ఆర్ట్ డైరెక్టర్ కమ్ ఫోటో గ్రాఫర్ ఉన్నారు. ఇందులోని చాలా కవర్ పేజీలకు ఆయన తీసిన ఫోటోలనే ఉపయోగించారు. ఆ క్రియేటివిటీ కారణంగానే కథానాయికలు సైతం వంశీ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. సాంకేతిక నిపుణులు ఆయనతో పనిచేయడానికి పోటీ పడుతుంటారు. నిజం చెప్పాలంటే వంశీ ఇచ్చే ఆప్షన్స్ నుండి ఒకదానిని ఎంపిక చేసుకోవడం అనేది ఎదుటి వారికి పెద్ద పరీక్ష. అలాంటి పరీక్షలో నెగ్గిన ముఖచిత్రమే చివరకు ముద్రణకు వెళ్ళింది. ఇప్పుడీ ‘పొలమారిన జ్ఞాపకం’ పుస్తకాన్ని మే 1న డైరెక్ట్ గా మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. మల్టీకలర్ ఆర్ట్ పేపర్ లో ముద్రితమైన 700 పేజీల ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకంలో 70 కథలు ఉన్నాయని, ప్రచురణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, ప్రతి కథకూ సుప్రసిద్ధులైన చిత్రకారులతో బొమ్మలు వేయించామని వంశీ తెలిపారు. నిజానికి పుస్తకం ముద్రణ ఖర్చులో సగం రేటుకే దీనిని విక్రయిస్తున్నారు. దానికి కారణం తన మీద అభిమానంతో కొందరు మిత్రులు దీనిని స్పాన్సర్ చేయడమే అంటున్నారు వంశీ. విశేషం ఏమంటే… ఆవిష్కరణకంటే ముందే దాదాపు ప్రచురించిన కాపీలన్నీ అమ్ముడైపోతున్నాయట! అన్నట్టు ‘పొలమారిన జ్ఞాపకాలు -2’ పుస్తకం సైతం ప్రచురణకు రెడీ అవుతోంది. వంశీ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఏమంటే… ‘జ్ఞాపకానికొస్తున్నాయి….’ పేరుతో వంశీ తన 25 చిత్రాల ఫ్లాష్ బ్యాక్ లను గుర్తు చేసుకోబోతున్నారు. సో… బీ రెడీ!!