సినిమా పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి, అలా సులభంగా థియేటర్లలోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం సంవత్సరాల తరబడి ల్యాబ్‌లోనే ఆగిపోతాయి. అయితే, వీటిలో కొన్ని సినిమాలు సరైన కంటెంట్ లేక ఆగిపోతే, మరికొన్ని మాత్రం ప్రత్యేకమైన కథాంశం, ఎవరూ ఇంతవరకు టచ్ చేయని విషయాలు, ట్రెండింగ్ అంశాలు ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఇలాంటి చిత్రాల్లో ఒకటే ‘అరి’. ‘పేపర్ బాయ్’ సినిమాతో సూపర్ హిట్ సాధించిన జయశంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు గడిచాయి. నిజానికి ఈ సినిమాకు ముందు జయశంకర్ గీతా ఆర్ట్స్‌లో మరో చిత్రం చేయాల్సి ఉంది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో కాస్త విరామం తీసుకుని, కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ సినిమాను రూపొందించారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని అరిషడ్వర్గాల ఆధారంగా కథను రాసుకున్నారు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటీనటులతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు.
గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రమోషన్లు కూడా షురూ చేశారు. టీజర్, ట్రైలర్‌తో పాటు మంగ్లీ పాడిన కృష్ణుడి పాటను కూడా రిలీజ్ చేశారు.
ప్రచార చిత్రాలన్నీ మంచి స్పందనను రాబట్టాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. వెంకయ్య నాయుడు, ‘ఇస్కాన్’ ప్రముఖులు, చిన్న జీయర్ స్వామి, ఇంకా పలు హిందూ సంఘాలు ఈ సినిమాను చూసి చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఇవన్నీ ఏడాది క్రితం జరిగిన సంగతులు. ఆ సమయంలో సినిమాను విడుదల చేసి ఉంటే, సినిమాకు వచ్చిన హైప్ ఎంతో కొంత ఉపయోగపడేది. కానీ ఏ కారణంగానో అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రమోషన్లను మళ్లీ మొదలుపెట్టారు. నిన్న ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఈ చిత్ర థీమ్ సాంగ్‌ను విడుదల చేయించారు. ‘భగ భగ..’ అంటూ సాగే ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈసారి కూడా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నప్పటికీ, బీజేపీ అగ్ర నాయకుల మద్దతు ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడం లేదో అర్థం కావడం లేదు. ఇలాంటి వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఆలస్యమైన కొద్దీ కంటెంట్ పాతబడి, సాధారణ చిత్రంగా మారే అవకాశం ఉంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియదా? లేక తెలిసినా విడుదల విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? ఏది ఏమైనా, ఆలస్యం అమృతాన్ని విషంగా మార్చుతుంది.