‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ … ఇదీ సినిమా పేరు! మరి టైటిల్ ని బట్టీ కథ ఏమై ఉండొచ్చని మీరూహిస్తున్నారు? అఫ్ కోర్స్, హారరో, సస్పెన్సో మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీ తీస్తున్నట్టున్నారు… అనుకున్నారా? అయితే, మీ అంచనా రైటే! కానీ, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ ఓ స్పెషల్ థ్రిల్లర్! ఎందుకంటే, ఇందులో మొదటి సారి హాలోవిన్ పార్టీ గురించి చూపించబోతున్నారు. తెలుగులో ఇంత వరకూ హాలోవిన్ నేపథ్యంలో సినిమాలేవీ రాలేదు. సో, ‘అక్టోబర్ 31’ టాలీవుడ్స్ ఫస్ట్ హాలోవిన్ మూవీగా భావించచ్చు!
సినిమా పేరులోనే ‘లేడీస్ నైట్’ ఉంది కాబట్టి మూవీలో గ్లామర్ నాలుగింతలు ఉంటుందని వివరించారు నిర్మాత. మేఘా ఆకాశ్, మాంజిమా మోహన్, రెబా జాన్, నివేథా పెతురాజ్ ఆసక్తికరమైన పాత్రలు పోషిస్తున్నారట. అయితే, తమ మూవీలో మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రొడ్యూసర్ చెప్పటం మరింత విశేషం. ఇంకా సదరు స్టార్ బ్యూటీ ఎవరో నిర్ణయం కాలేదట. అయితే, హాలోవిన్ డే సమయంలో ఓ అమ్మాయి తన స్నేహితురాళ్లని ఆహ్వానించటంతో ‘అక్టోబర్ 31’ కథ మొదలవుతుందట. కానీ, వాళ్లు ప్లాన్ చేసిన ఓ ప్రాంక్ వర్కవుట్ కాక బ్యాక్ ఫైర్ కావటమే మూవీలో ట్విస్ట్!