మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సరికొత్త లవ్ స్టోరీతో ఫ్రెష్ లుక్ లో లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు విషయంలోకి వస్తే… ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో నటించిన ఓ మాస్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా విశ్వక్ ప్రకటించాడు. ప్రశంసలు పొందిన మలయాళ యాక్షన్ డ్రామా ‘అంగమలీ డైరీస్’ అధికారిక తెలుగు రీమేక్ “ఫలక్నుమా దాస్”. ఈ చిత్రంతో యువ హీరో విశ్వక్ సేన్ దర్శకుడు, నిర్మాతగా మారారు. అంతేకాదు ఈ చిత్రంతోనే విశ్వక్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ రోజు విశ్వక్ ఇన్‌స్టాగ్రామ్‌లో “ఫలక్నుమా దాస్” ముహూర్తం వేడుక నుండి త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. “3 సంవత్సరాల క్రితం, ఫలక్నుమాదాస్ ముహూర్తం షాట్. నిన్నటిలా అనిపిస్తుంది ”అని విశ్వక్ తన పోస్ట్‌లో రాశాడు. ఇక ఈ పోస్టులోనే “ఫలక్నుమా దాస్ 2” కోసం ఈ చిత్ర బృందం త్వరలో మళ్లీ కలుస్తుందని చెప్పారు. ఆసక్తికరం విషయం ఏమంటే… ‘అంగమలీ డైరీస్’ కు సీక్వెల్ లేదు. మరి విశ్వక్ “ఫలక్నుమా దాస్ 2” కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.