ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళస్టార్ హీరో విజయ్ మాస్టర్
చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ బరిలో మాత్రం ఆ మూవీ విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత విజయ్ ఏ సినిమాలో చేస్తాడనే దానిపై వచ్చిన రకరకాల సందేహాలకు తెర దించుతూ, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడని అధికారిక వార్త వచ్చింది. విజయ్ 65వ చిత్రమైన దీనిలో అతనితో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విశేషం ఏమంటే… తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ఇవాళ బయటకు వచ్చింది. నెల్సన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మండేలా ఓ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈపాటికి మీకు విషయం అర్ధమై ఉండాలి. ఇటీవలే ప్రముఖ కమెడియన్ యోగిబాబు మండేలా
చిత్రంలో టైటిల్ పాత్ర పోషించాడు. ఇప్పుడు విజయ్ సినిమాలో తానూ నటిస్తున్నానని యోగి బాబు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా చెప్పాడు. గతంలో విజయ్ నటించిన సర్కార్
లోనూ యోగిబాబు నటించి, విజయ్ అభిమానులను మెప్పించాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. మరి ఈ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సంబంధించిన ఇంకేమి అప్ డేట్స్ వస్తాయో చూడాలి.