యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘శక్తి, ఊసరవెల్లి’ చిత్రాలతో పాటు హిందీ, తమిళ చిత్రాలలోనూ నటించాడు విద్యుత్ జమ్వాల్. పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు యాక్షన్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… ఇటీవలే సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించిన విద్యుత్ జమ్వాల్ త్వరలోనే హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి, చిత్రాలను నిర్మించడంతో పాటు తానూ నటుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందబోతున్నాడు. బ్రూస్ లీ, జాకీ చాన్, జెట్లీ తర్వాత మర్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందబోతున్నాడు విద్యుత్ జమ్వాల్. అంతర్జాతీయంగా పేరున్న టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ వండర్ స్ట్రీట్ తో విద్యుత్ జమ్వాల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు.
Read Also: ఇవాళే సెట్స్ పైకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు!
ఈ సంస్థ హాలీవుడ్ లో టోనీ జా, మైఖేల్ జా వైట్, డాల్ఫీ లండ్ గ్రెన్ వంటి యాక్షన్ హీరోలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గత యేడాది ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ జమ్వాల్ పాల్గొని ఇంటర్నేషనల్ యాక్షన్ ఐకాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ సందర్భంగా విద్యుత్ జమ్వాల్ ద్వారా కలరియపట్టు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకుని దీనిని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేలా చేయాలని కొందరు నిర్మాతలు భావించారు. ఆ రకంగా భారతీయ మార్షల్ ఆర్ట్స్ గురించి పశ్చిమదేశాలకు తెలియ చేయబోతున్నాడు విద్యుత్ జమ్వాల్. సొంత నిర్మాణ సంస్థతో పాటు హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ను కలుపుకుని ఓ మార్షల్ ఆర్ట్స్ మూవీని చేయడానికి విద్యుత్ జమ్వాల్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే… విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం ‘సనక్’, ‘ఖుదా హఫీజ్ చాప్టర్ -2’ చిత్రాలలో నటిస్తున్నాడు.