సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (79) నాగపూర్ లో గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. హిందీ, మరాఠీ, భోజ్ పురిలో వందకు పైగా చిత్రాలకు రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. దాదా కోండ్కే కెరీర్ ప్రారంభంలో విజయ్ తో మరాఠీ చిత్రాలకు, ఆ పైన హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చే అవకాశం కల్పించారు. తన స్నేహితుడు సురేంద్రతో కలిసి విజయ్ ‘రామ్ లక్ష్మణ్’ పేరుతో చిత్రసీమలో సంగీతాన్ని కొన్నేళ్ళు అందించారు. 1977లో వచ్చిన ‘ఏజెంట్ వినోద్’ చిత్రం వీరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రామ్ (సురేంద్ర) 1976లో కన్నుమూశారు. అయినా స్నేహితుడి జ్ఞాపకంగా తన స్క్రీన్ నేమ్ ను రామ్ లక్ష్మణ్ గానే విజయ్ కొనసాగించారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు. 1989లో వచ్చిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో సంగీత దర్శకుడిగా రామ్ లక్ష్మణ్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ‘హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాలూ వాటిలో ఉన్నాయి.