సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ పీపుల్ కూడా సెలబ్రెటిలు అవుతున్నారు. వారిలోని ట్యాలెంట్‌ను చూపించుకుంటూ బుల్లితెర, వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అందులో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటన, అందం తో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా సిరీస్‌లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘బేబీ’ సినిమాతొ హీరోయిన్‌గా ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది.
తర్వాత వరుసగా మూడు నాలుగు సినిమాలు తీసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి చైతన్య చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.. ‘టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఏమంటూ వచ్చిందో తెలియదు కానీ.. ఈ ప్రచారం వల్లే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీ కి రావడానికి భయపడుతున్నారు. అసలు ప్రయత్నమే చేయకుండా అవకాశాలు రావడం లేదంటే అది ఎంతవరకు కరెక్ట్.. ఓపికతో ప్రయత్నిస్తేనే కదా అవకాశాలు వస్తాయో రావో తెలిసేది. అందుకు ఉదాహరణ నేనే. కొత్తగా వచ్చే వారికి నేను ఇచ్చే సలహా ఒకటే.. అవకాశాలు రావు అని భయపడి ఆగిపోయే బదులు గట్టిగా ప్రయత్నిస్తే, అవే అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాడు..’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజంట్ వైష్ణవి మాటలు వైరల్ అవుతున్నాయి.