Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!

Vaishnavi

Vaishnavi

Vaishnavi: టాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన వైష్ణవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సినిమా కథాంశంపై వైష్ణవి మాట్లాడుతూ ఓ కీలకమైన, సెన్సేషనల్ పాయింట్‌ను బయటపెట్టారు. సినిమాలో హీరో హీరోయిన్లు యూకే చదువుల నేపథ్యంలో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’లో ఉంటారనే నిజాన్ని ఆమె స్పష్టం చేశారు. సాధారణంగా లివ్-ఇన్ రిలేషన్ కథలు అంటేనే శృతిమించిన రొమాన్స్, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే దీనిపై వైష్ణవి క్లారిటీ ఇస్తూ.. “దర్శకుడు ఆదిత్య హాసన్ గతంలో తీసిన ‘90s’ వెబ్ సిరీస్ అంత క్లీన్‌గా ‘ఎపిక్’ ఉండకపోవచ్చు. ఎందుకంటే కథలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ప్రధానాంశం. అయినప్పటికీ కథకు ఏది అవసరమో అంతే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, హద్దులు దాటకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి నిరభ్యంతరంగా చూడొచ్చు” అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం సితార బ్యానర్‌లోనే నితిన్ సరసన నటిస్తున్న వైష్ణవి, తమిళంలో రెండు, హిందీలో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వంటి యూత్-సెంట్రిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందో చూడాలి!