పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతనితో సినిమాలు చేయడానికి కన్నడ స్టార్స్ సంగతి ఏమో కానీ మన టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్… ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ చేస్తుంటే… మరికొందరు స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే… ఈ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఇవాళ కొవిడ్ 19కు తొలి డోస్ వాక్సిన్ వేయించుకున్నాడు. నర్స్ సూది గుచ్చుతుంటే… భయంతో ప్రశాంత్ నీల్ కళ్ళు మూసుకున్నాడు. ఈ ఫోటోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకోవడం మొదలెట్టారు. నర్సు దగ్గర సింపతీ కోసమా? అని కొందరు ప్రశ్నిస్తే, నటనలో మీకు ఆస్కార్ ఇవ్వొచ్చు అని మరికొందరు ఆట పట్టించారు. వయొలెన్స్ చిత్రాలు తీసే మీకు ఇంజెక్షన్ అంటే భయమా అని ఆశ్చర్యపోతూ మీమ్స్ ను క్రియేట్ చేశారు మరికొందరు. ఇవన్నీ మాకెందుకు కేజీఎఫ్-2కి సంబంధించి అప్ డేట్ ఇవ్వండీ అని మరికొందరు వాపోయారు. ఇంకొందరైతే మీలాంటి సెలబ్రిటీస్ కు వాక్సిన్ దొరుకుతుంది. మాకు మాత్రం దొరకడం లేదంటూ విమర్శించారు. తెర మీద మీరు చూపించే వయొలెన్స్ కు, ఈ ఎక్స్ ప్రెషన్ కూ ఏమైనా సంబంధం ఉందా? అని కొందరు ఉడికించారు. కేజీఎఫ్ -2లో కీలక పాత్ర పోషిస్తున్న రవీనా టాండన్ సైతం ప్రశాంత్ నీల్ ను సరదాగా ఆటపట్టించడం విశేషం.