తెలుగు సినిమా పరిశ్రమ బాక్సాఫీస్ పరంగా రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కొన్ని సినిమాలు సాధించిన వసూళ్లు ఇండస్ట్రీ స్థాయినే మార్చేశాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా క్రేజ్‌తో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో నిలిచింది ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాతి స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ ఉంది. రూ.346 కోట్ల గ్రాస్‌తో పుష్ప 2 సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమాతో మరో స్థాయికి చేరింది. మూడో స్థానంలో రాజమౌళి మరో ఎపిక్ మూవీ ‘బాహుబలి 2’ ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.327 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి.. అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ రూ.296 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ కేవలం 23 రోజుల్లోనే రూ.247 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (238 కోట్లు), ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ (234 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పండుగ సీజన్‌లో విడుదలై కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.218 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ రూ.210 కోట్లతో మరో భారీ హిట్‌గా నిలిచింది. ఈ టాప్ 10లో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అలా వైకుంఠపురములో’ రూ.194 కోట్ల గ్రాస్‌తో ముగించింది. ఈ సినిమాల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. భారీ కథలు, స్టార్ పవర్, పాన్ ఇండియా మార్కెట్ కలిసి టాలీవుడ్‌ను దేశంలోనే టాప్ ఇండస్ట్రీలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.
