బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా దూసుకుపోతున్న తేజా సజ్జ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అతనికి విషెస్ తెలియచేస్తూ, తేజా కెరీర్ ముచ్చట్లు తెలుసుకుందాం!
బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జ సమంత మూవీ ‘ఓ బేబీ’ లో యంగ్ హీరోగా నటించి, తొలి యత్నంలోనే చక్కని విజయాన్ని అందుకున్నాడు. సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, ప్రగతి వంటి సీనియర్స్ సమక్షంలో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తనదైన నటనను వెండితెరపై ప్రదర్శించాడు తేజా. ఇక ఈ యేడాది ప్రారంభంలోనే టాలీవుడ్ కు జాంబీస్ ను పరిచయం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీరెడ్డి’లో తేజా సజ్జ సోలో హీరోగా నటించి చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో మలయాళ చిత్రం ‘ఇష్క్’ రీమేక్ లోనూ నటించాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన ‘ఇష్క్’ మాత్రం ప్రేక్షకుల ప్రేమను పొందలేకపోయింది. అయితే నటుడిగా ఇటు తేజా సజ్జకు, అటు ప్రియా ప్రకాశ్ వారియర్ కు మంచి మార్కులే పడ్డాయి.
Read Also : కాన్సెప్ట్ టీజర్ : సంపత్ నంది సైఫై మూవీ “సింబా”
ప్రస్తుతం తేజా సజ్జ రెండు వైవిధ్యమైన చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘అద్భుతం’ అనే ఫాంటసీ లవ్ స్టోరీ. ‘పెళ్ళిగోల, తరగతి గది దాటి’ వెబ్ సీరీస్ లను తెరకెక్కించిన మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు కాగా ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుల్ల, సృజన్ యెరబోలు నిర్మిస్తున్నారు. రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ ఇందులో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘జాంబీ రెడ్డి’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథను అందించారు. రథన్ సంగీతాన్ని సమకూర్చగా, లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇక తేజా సజ్జ నటిస్తున్న రెండో సినిమా ‘హను – మాన్’. ఈ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. తనకున్న లవర్ బోయ్ ఇమేజ్ కు భిన్నంగా, బడ్జెట్ గురించి ఆలోచించకుండా వినూత్న కథలకు తేజా సజ్జ పచ్చజెండా ఊపుతుండటం విశేషమనే చెప్పాలి. ఈ యేడాది ఇప్పటికే ఓ విజయంతో, ఓ పరాజయంతో తన కెరీర్ గ్రాఫ్ ను బాలెన్స్ చేసిన తేజాకు రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి. అతని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్స్ శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేశాయి.