మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ హీరో వేణు. గతంలో పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ డ్రామాల్లో నటించిన ఈ హీరో చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో చింతకాయల రవి, దమ్ము సినిమాల్లో సహాయక పాత్రల్లో కన్పించాడు. ఆయన చివరిగా హీరోగా నటించిన చిత్రం “మాయగాడు”. 2012-13 తరువాత ఈ హీరో అసలు సిల్వర్ స్క్రీన్ పై కన్పించలేదు. తాజాగా రవితేజ సినిమాలతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండడం గమనార్హం. ఆయన పాత్ర సినిమాలో కీలకమని తెలుస్తోంది.
Read Also : నాని ఖాతాలో మరో మైలురాయి
కాగా శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిజ సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న ప్రత్యేకమైన థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘మజిలి’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. “రామారావు”లో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామ కృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.