ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, దాని దుర్వినియోగం సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నటి శ్రీలీల సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై, తన తోటి నటీమణులపై జరుగుతున్న ఏఐ ఆధారిత తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. నటి శ్రీలీల తన పోస్ట్‌లో ఏఐ ఆధారిత అసభ్యకర కంటెంట్‌ను సృష్టించే వారిని మరియు దానికి మద్దతు ఇచ్చే వారిని గట్టిగా హెచ్చరించారు. సినిమా రంగంలో నటీమణులుగా ఉన్నప్పటికీ, బయట ప్రపంచంలో ప్రతి అమ్మాయి ఒకరికి కూతురో, సోదరియో లేదా సహోద్యోగియో అవుతుందని ఆమె గుర్తు చేశారు. కళను వృత్తిగా ఎంచుకున్న మహిళలు భయం లేని, రక్షణతో కూడిన వాతావరణంలో పని చేయాలని ఆశిస్తారని, కానీ ఇలాంటి సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!
షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో తనకు వెంటనే తెలియలేదని, తన శ్రేయోభిలాషులు చెప్పిన తర్వాతే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని శ్రీలీల పేర్కొన్నారు. కేవలం తనకే కాకుండా, తన తోటి నటీమణులకు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని, అందరి తరపున తాను గొంతు ఎత్తుతున్నానని ఆమె తెలిపారు. ఇంటర్నెట్ ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలు తనను ఎంతగానో కలచివేస్తున్నాయని, ఇది ఒక వ్యక్తిగత దాడి వంటిదేనని ఆమె అభివర్ణించారు. ఈ విషయాన్ని తాను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు శ్రీలీల స్పష్టం చేశారు.
Also Read:BB 5: బాలయ్య బోయపాటి కాంబోలో మరో సినిమా.. 10 రోజుల్లో ప్రకటన?
ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులకు అప్పగించామని, ఇకపై వారు దీనిని పర్యవేక్షిస్తారని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి అసత్యపు ప్రచారాలను లేదా మార్ఫింగ్ వీడియోలను ప్రోత్సహించవద్దని, తమకు అండగా నిలబడాలని చేతులు జోడించి మరీ కోరారు. టెక్నాలజీ మనుషుల జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలి కానీ, వారిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి కాదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి సైబర్ నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.
