Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:

Family Pack

Family Pack

’ శ్రీ విష్ణు, ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ అంటేనే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారంటీ! ఈ హిట్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ తాజాగా విడుదలైంది. 2027 సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఫన్ రైడ్‌లా సాగిపోతూనే, చివర్లో వేసిన ఓ పంచ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టీజర్ చివర్లో శ్రీ విష్ణు ఒక రైటర్‌తో చెప్పే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “ఏ రైటరో.. ఏం కథ రాస్తున్నావురా?” అని అడగగా, అవతల ఉన్న పోలీస్ స్టేషన్ రైటర్ “గుర్తింపు కథ సార్” అంటాడు. దానికి శ్రీ విష్ణు.. “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు రేయ్! ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలి!” అంటూ వేసిన సెటైర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కాలంలో వస్తున్న ‘గుర్తింపు’ నేపథ్య సినిమాలపై వేసిన ఈ పంచ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. బాధ్యత గల ఫ్యామిలీ మ్యాన్‌లా కాకుండా, తన కుటుంబం గురించి అస్సలు పట్టించుకోని స్వార్థపరుడిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. “ఒక ఇంట్లో బంజారాహిల్స్, బోరబండ ఉంటే ఎలా ఉంటుందో మా ఇల్లు అలా ఉంటుంది” అంటూ ఆయన కుటుంబంలోని లైఫ్ స్టైల్ తేడాలను చూపించిన తీరు కడుపుబ్బా నవ్విస్తోంది. ఇలాంటి స్వార్థపరుడైన పోలీస్ జీవితంలోకి తన పై అధికారి కూతురు రావడంతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆ తర్వాత జరిగే గందరగోళం, కామెడీ ఎలా ఉండబోతోందో టీజర్‌తోనే ఓ క్లారిటీ ఇచ్చేశారు దర్శకుడు రామ్ అబ్బరాజు. శ్రీ విష్ణు తన సహజమైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి అదరగొట్టారు. హీరోయిన్‌గా సాక్షి మధోల్కర్ చాలా అందంగా కనిపించింది. ఇక శ్రీ విష్ణు – వీకే నరేష్ కాంబినేషన్ అంటేనే నవ్వులకు కొదవ ఉండదు; ఈ సినిమాలోనూ వీరిద్దరూ మరోసారి సందడి చేయనున్నారు. శ్రీ విష్ణు తల్లిగా అభిరామి, తమ్ముడిగా బుల్లిరాజు, సాక్షి తండ్రిగా మురళీ శర్మ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె. యువరాజ్ కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అనిల్ పసల ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొత్తానికి, బలవంతంగా ఇరికించిన కామెడీ కాకుండా సన్నివేశాల నుంచే పుట్టే స్వచ్ఛమైన వినోదంతో 2027 సంక్రాంతికి ‘ఫ్యామిలీ ప్యాక్’ గట్టిగానే నవ్వించబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది!