Site icon NTV Telugu

SP Balu: వివాదాల నడుమ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..చివరి కోరిక నెరవేరింది!

Sp Balu

Sp Balu

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆవిష్కరించడం అనేక నాటకీయ పరిణామాల నడుమ జరిగింది. బాలు సోదరి ఎస్పీ శైలజ మరియు ఆమె భర్త, నటుడు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ పనులు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ తెలంగాణ ఉద్యమకారుడు, పృథ్వీరాజ్ అనే వ్యక్తి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. “ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, తెలంగాణ గురించి పాట పాడను అని చెప్పిన వ్యక్తి విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతిలో ఎలా పెడతారు?” అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి, ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Also Read :Varanasi : ‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయన ఎస్పీ బాలు విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు సోదరి ఎస్పీ శైలజ మాట్లాడుతూ, రవీంద్రభారతిలో తన విగ్రహం ఉండాలనేది బాలు చివరి కోరిక అని వెల్లడించారు. “ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బాలు విగ్రహాలు అనేక చోట్ల ఉన్నాయి. హైదరాబాద్‌తో బాలుకు విడదీయరాని అనుబంధం ఉంది, అదికాక రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలనేది ఆయన చివరి కోరిక ” అని ఆమె పేర్కొన్నారు. బాలు తన కెరీర్‌లో అత్యధిక సమయం హైదరాబాద్‌లోనే గడిపారని, ఇక్కడి ప్రేక్షకులు, అభిమానుల నుంచి అపారమైన ప్రేమాభిమానాలను అందుకున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. తన సోదరుడి చివరి కోరికను నెరవేర్చడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన, బాలు అభిమానులకు, సంగీత ప్రియులకు ఆనందాన్ని కలిగించినప్పటికీ, స్థానికతకు సంబంధించిన వివాదాల కారణంగా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, తెలుగు సినిమా, సంగీత ప్రపంచానికి ఎస్పీ బాలు చేసిన సేవలు అనన్యసామాన్యం, ఆయనను జాతి, ప్రాంతాలకు అతీతంగా కళాకారుడిగా గుర్తించాలనేది పలువురి అభిప్రాయం.

Exit mobile version