Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!

Singeetham Srinivasa Rao

Singeetham Srinivasa Rao

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ సరికొత్త వినూత్న ప్రయోగాలకు నాంది పలికే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన గోల్డెన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సింగ్ గీతం’. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా కాన్సెప్ట్ గురించి సింగీతం మాట్లాడుతూ.. “సుమారు 40 ఏళ్ల క్రితం నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా, సినిమాలోని ప్రతి సంభాషణను మాట్లాడకుండా కేవలం పాట రూపంలోనే చెప్పాలని అనుకున్నాను. సాధారణంగా బ్రాడ్‌వే మ్యూజికల్స్‌లో పాటలు, మాటలు వేరువేరుగా ఉంటాయి. కానీ నేను మాత్రం ప్రతి డైలాగ్‌ను పాడుతూ చెప్పేలా ఒక సినిమా చేయాలని కలగన్నాను. ఆ ఆలోచన నాతోనే దాదాపు 40 ఏళ్లు ప్రయాణించింది. చివరికి నాగశ్విన్ దృష్టికి ఈ కథ వెళ్లడం, ఆయన దీన్ని ఎంతో ఇష్టపడి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నాగశ్విన్ ఇచ్చిన నమ్మకం, సంపూర్ణ సహకారం లేకపోతే ‘సింగ్ గీతం’ ఈరోజు రూపం దాల్చేది కాదు” అని చెప్పుకొచ్చారు.

×
×
Ad

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టడంపై స్పందిస్తూ.. “నాగశ్విన్ ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించాలని కోరారు. నాలో ఇప్పటికీ ఆ ఉత్సాహం ఉంది. అయితే నా వయస్సు (94 ఏళ్లు) దృష్ట్యా లైవ్‌గా సెట్స్‌కు రావడం కష్టం కాబట్టి, సాంకేతిక సహకారంతో సరికొత్త ఆన్‌లైన్ విధానాన్ని నాగశ్విన్ ఏర్పాటు చేశారు. నేను నా ఇంట్లోని హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మానిటర్లలో ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సూచనలు ఇచ్చేవాడిని. అక్కడి కెమెరాలన్నీ నా హోమ్ థియేటర్‌కు కనెక్ట్ అయి ఉండేవి. ఇలా ఇంట్లో నుంచే మొత్తం సినిమాను డైరెక్ట్ చేయడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. ఇలాంటి సరికొత్త టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ను సాధ్యం చేసింది కేవలం నాగశ్విన్ మాత్రమే” అని లెజెండరీ డైరెక్టర్ కొనియాడారు.