బయోపిక్స్ చేయటంలో నటీనటులు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీలో అయితే బయోపిక్స్ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. సౌత్ లో కాస్త ఊపు తక్కువున్నా మన వాళ్లు కూడా అడపాదడపా అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నారు. చిరంజీవి ‘సైరా’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ మొదలు ‘జార్జ్ రెడ్డి’, ‘మల్లేశం’ లాంటి చిన్న సినిమాల దాకా పలువురు దర్శకనిర్మాతలు బయోపిక్ జానర్ ని టచ్ చేసి చూశారు! ఇక తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచితుడైన హీరొ సిద్ధార్థ్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ బయోపిక్ కి సిద్ధం అవుతున్నాడట…
‘ద వాల్’గా క్రికెట్ అభిమానులకి ఎంతో అభిమాన బ్యాట్స్ మన్ అయిన రాహుల్ ద్రావిడ్ టీమిండియాకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఆయన జీవితం అంటే ప్రేక్షకులకి సహజంగానే ఆసక్తి ఉంటుంది. అంతే కాదు, తెలుగు, తమిళం కన్నడ అన్న భాషా భేదాలు లేకుండా దేశంలోని ఆందరూ ఆదరిస్తారు. అందుకే, ఇప్పటికే ‘రాహుల్ ద్రావిడ్’ బయోపిక్ మేకర్స్ ఆయన్ని కలిశారట. స్క్రిప్ట్ వినిపించి అనుమతి కూడా తీసుకున్నారట. అయితే, తెరపై ద్రావిడ్ గా సిద్దార్థ్ ని అనుకుంటున్నారని సమాచారం.
రాహుల్ ద్రావిడ్ బయోపిక్ లో సిద్ధార్థ్ కనిపిస్తాడని ఇంకా కన్ ఫర్మ్ గా న్యూస్ లేదు. అయితే, ఇటువంటి అరుదైన అవకాశాన్ని సిద్దూ ఒప్పుకుని తీరతాడని చెన్నై టాక్. ప్రస్తుతానికి ఆయన ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్నాడు. శర్వానంద్, అదితి రావ్ తో కలసి చేస్తోన్న ఆ సినిమా పూర్తయ్యాక ద్రావిడ్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లవచ్చు…