బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఒక్క శిల్పాశెట్టికి తప్ప. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతో పాటు ఆమె అత్తమామలు, ఆమె తల్లి సునంద… వీరితో పాటు శిల్పాశెట్టి దగ్గర పనిచేసే ఇంకో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందట. “గత 10 రోజులుగా ఒక కుటుంబంగా మాకు చాలా కష్టంగా ఉంది. నా అత్తమామలకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తరువాత సమిషా, వియాన్రాజ్, మా అమ్మ, చివరిగా రాజ్… వీరంతా అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో వారివారి గదులలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ సలహాను అనుసరిస్తున్నారు. మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. దేవుని దయ వలన ప్రతి ఒక్కరూ కోలుకునే దశలో ఉన్నారు. నాకు మాత్రం నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. త్వరగా స్పందించి సత్వర సహాయం అందించినందుకు బిఎంసి అధికారులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. దయచేసి మీ ప్రార్థనలలో మా అందరినీ కొనసాగించండి. మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండి. కరోనా పాజిటివ్ వచ్చినా రాకపోయినా సానుకూలంగా ఉండండి” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది శిల్పాశెట్టి. ఆమె ఈ పోస్ట్‌ను పంచుకున్న వెంటనే కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, సునీల్ శెట్టి, మాధురి దీక్షిత్, రిద్దిమా కపూర్, మలైకా అరోరా, భూమి పెడ్నేకర్ తదితరులు త్వరగా శిల్పాశెట్టి ఫ్యామిలీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా శిల్పాశెట్టి సినిమాల విషయానికొస్తే… ఆమె పరేష్ రావల్, మీజాన్, ప్రణీత సుభాష్ తదితరులతో కలిసి ‘హంగామా 2’లో నటిస్తోంది.