హీరో శర్వానంద్ హఠాత్తుగా డాక్టర్ అయిపోయాడేమిటా? అని ఆశ్చర్యపోకండీ…. తెర మీద మాత్రమే ఆయన డాక్టర్ కాబోతున్నారు. ఇటీవల విడుదలైన శ్రీకారం
మూవీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుండి రైతుగా మారిపోయిన శర్వా, ఇప్పుడు డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి… శర్వాను డాక్టర్ చేస్తోంది చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. అయితే ఆమె శర్వాతో సినిమా తీస్తోందని అనుకోకండీ…. ఓ షార్ట్ ఫిల్మ్ ను శర్వాతో ఉపాసన తీయడానికి ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్శన్ గా, బి పాజిటివ్ మేగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉన్న ఉపాసన యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కూడా నిర్వహిస్తున్నారు. కరోనా పేండమిక్ సమయంలో అపోలో హాస్పిటల్ సైతం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు అందించిన సేవలు కూడా అభినందించదగ్గది. ఈ సమయంలో వారందించిన సేవలను సామాన్య ప్రజలకు తెలియచేస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ ను తీయాలని ఉపాసన భావిస్తున్నారట. అందులో చరణ్ కు అత్యంత ఆప్తుడైన శర్వానంద్ ను డాక్టర్ పాత్రలో చూపించాలన్నది ఆమె అభిమతమట. కొంతమంది ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తే, ప్రజలు పాజిటివ్ గా వాటిని రిసీవ్ చేసుకుంటారు. అలా ఓ డాక్టర్ గా శర్వా చెప్పే మాటలు జనాల మనసుల్ని హత్తుకుంటాయన్నది ఉపాసన నమ్మకం. మరి ఈ షార్ట్ ఫిల్మ్ ను ఏ రకంగా ప్రజలలోకి తీసుకెళ్ళతారో చూడాలి.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం శర్వానంద్ ద్విభాషా చిత్రం మహా సముద్రం
లో నటిస్తున్నాడు. అలానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు
చిత్రంలోనూ నటించడానికి అంగీకరించాడు.