‘ఇండియన్ ఐడల్’ మ్యూజిక్ రియాల్టీ షోకి దేశ వ్యాప్తంగా పేరుంది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నడుస్తోంది. అయితే, మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ కూడా కాంపిటీషన్ లో పాల్గొంటోంది. అంతే కాదు, తన టాలెంట్ తో టైటిల్ దక్కించుకునే ప్రయత్నంలో గట్టిగా కృషి చేస్తోంది. దాదాపుగా ప్రతీ వారం షో నిర్వహించే జడ్జీల నుంచీ ప్రశంసలు పొందే షణ్ముఖప్రియ ఈసారి బాలీవుడ్ లెజెండ్ జీనత్ అమన్ వద్ద నుంచీ మెప్పు పొందనుంది.
ఈ వీకెండ్ లో ప్రసారం అయ్యే ఇండియన్ ఐడల్ 12 లెటెస్ట్ ఎపిసోడ్స్ లో జీనత్ అమన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకోబోతున్నారు. కంటెస్టెంట్స్ ఆమె కెరీర్ లోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని పాడనున్నారు. ఆమె 50 ఇయర్స్ జర్నీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు. అయితే, జీనత్ అమన్ మరుపురాని పాటల్లో ఒకటైన ‘చురాలీయా హై తుమ్నే జో దిల్ కో’ గీతాన్ని మన షణ్ముఖ ప్రియ ఆలపించనుంది. ‘యాదోంకీ బారాత్’ సినిమాలోని ఆ పాట జీనత్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసిందట! అంతే కాదు, షణ్ముఖప్రియ వేసుకున్న డ్రెస్ కూడా జీనత్ ను అమితంగా ఆకర్షించింది!
‘యాదోంకి బారాత్’ సినిమాలో ‘చురాలియా హై’ పాట సమయంలో జీనత్ ఓ వెస్ట్రన్ ఔట్ ఫిట్ ధరిస్తుంది. సరిగ్గా అటువంటిదే షణ్ముఖప్రియ కూడా ధరించటంతో జీనత్ అమన్ మురిసిపోయారు. ‘బేబీ జీనత్’ అంటూ కితాబునిచ్చారు. అందుకు ప్రతిగా, షణ్ముఖప్రియ కూడా లెజెండ్రీ యాక్ట్రస్ కు థాంక్స్ చెబుతూనే ‘ఇండియన్ ఐడల్’ తనకు ఎంతో గొప్ప అవకాశాన్ని అందించిందనీ అభిప్రాయపడింది.
ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ దిగ్గజాల మెప్పు పొందిన మన షణ్ముఖప్రియ అలియాస్ ‘బేబి జీనత్’… ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి మరి!