ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. థియేటర్ల దగ్గర సినిమాల జాతర మొదలైంది. అయితే ఈ సెప్టెంబర్ లో కూడా వరుస రిలీజ్ లు ఉన్నాయి. ఈ సినిమాల జాతర కంటే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. మరి రాబోయే సినిమాల్లో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెట్టే సినిమా ఏది? సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’తో కొత్త హీరో మాధవ్ భూపతిరాజు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్, ఊరి నమ్మకాలు, ఫ్యాంటసీ టచ్.. వీటన్నింటి మధ్య ఒక బఫెలోను కాపాడాలనే యువకుడి కథతో ట్రైలర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇక్కడే సినిమా ముందున్న పెద్ద పరీక్ష.. స్టార్ హీరో లేకపోయినా కంటెంట్ తో థియేటర్లను ఫీల్ చేయాలి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి పల్లెటూరి కథలు కొత్త కాదు. మాస్ ఎమోషన్ కూడా కొత్త కాదు. అయితే మారెమ్మలో కొత్తగా చెప్పేదేంటి? అదే ఈ చిన్న సినిమా ముందున్న పెద్ద ప్రశ్న.
సెప్టెంబర్ 11న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’తో మిస్టరీ, మైథాలజీ అడ్వెంచర్ కలిపిన త్రిల్లర్ తో వస్తున్నాడు. ఒక పురావస్తు శాస్త్రవేత్త, మహేంద్రగిరి కొండలు, పురాతన రహస్యాలు, కనిపించకుండా పోయిన ఒక కళాఖండం, దాని చుట్టూ దాగున్న శక్తులు.. ఇదంతా వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ మైథాలజీ అంటే బ్యాక్ డ్రాప్ మాత్రమే సరిపోదు. మిస్టరీ అంటే చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలి. అందుకే సుమంత్ సినిమాకు అసలు పరీక్ష ఇదే.. ఖచ్చితంగా త్రిల్ చేస్తుందా? పోస్టర్లు, టీజర్లలో కనిపించిన మిస్టరీ థియేటర్లో ఉండేదాన్ని బట్టే సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది.
ఇక సెప్టెంబర్ 18న రెండు పూర్తిగా డిఫరెంట్ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఒకటి రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’, మరొకటి నిహాల్ కోదాటి ‘సీక్రెట్ సోల్జర్’. అనుమాన పక్షిలో అనుమానమే హీరో. రాగ్ మయూర్ పోషిస్తున్న క్యారెక్టర్ ప్రతిదాన్ని అనుమానిస్తూ సాధారణ పరిస్థితులను కూడా గందరగోళంగా మార్చి డార్క్ కామెడీ టచ్ తో సినిమా సాగుతుంది. అయితే ఇలాంటి క్విర్కీ కంటెంట్ కి ఒక రిస్క్ ఉంటుంది. టీజర్ చూసి నవ్విన ప్రేక్షకుడు రెండున్నర గంటలు అదే ఎనర్జీతో కూర్చుంటాడా?
అదే రోజున వస్తున్న సీక్రెట్ సోల్జర్ మాత్రం స్పై యాక్షన్ త్రిల్లర్. దేశరక్షణ, కుట్ర కుతంత్రాలు, సీక్రెట్ మిషన్ చుట్టూ కథ నడుస్తుంది. కానీ స్పై సినిమాలు ఇప్పుడు మన ఆడియన్స్ కి కొత్త కాదు. అయితే సీక్రెట్ సోల్జర్ లో కొత్తగా చూపించబోయేది ఏంటి? అదే సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసే పాయింట్.
సెప్టెంబర్ టాలీవుడ్ కి మాత్రమే కాదు, అదర్ లాంగ్వేజ్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వార్ అంతకంతకూ మారుతోంది. స్టార్ హీరోల సీక్వెల్స్, పాన్ ఇండియా యాక్షన్, జానపద కథలు వస్తున్నాయి. సర్దార్ 2, మండాది, ది డివైన్ లాంటి సినిమాలకు ఉన్న ప్లస్ లు ఏంటి? మైనస్ లు ఏంటి? అంచనాలు ఎలా ఉన్నాయి? ఓవర్ హైప్ బాక్స్ ఆఫీస్ దగ్గర బూమరాంగ్ అవుతుందా?
సెప్టెంబర్ 10 న కార్తీ ‘సర్దార్ 2’ తో స్పై యాక్షన్ మోడ్ లోకి వస్తున్నాడు. సర్దార్ కి సీక్వెల్, కార్తీ డ్యూయల్ రోల్, ఆపోజిట్ ఎస్ జె సూర్య, పైగా స్పై త్రిల్లర్. ట్రైలర్ చూస్తే యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లోనే కనిపిస్తుంది. కార్తీ, ఎస్ జె సూర్య కాంబినేషన్ కూడా సినిమాకు బిగ్ అట్రాక్షన్ గా మారింది. కానీ ఇక్కడే అసలు సమస్య. ఇది సర్దార్ కి సీక్వెల్ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోవాలంటే కేవలం యాక్షన్ సరిపోతుందా? కార్తీ గత కొంతకాలంగా జపాన్, వాతియార్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచినట్లు స్వయంగా అంగీకరించాడు. అందుకే సర్దార్ 2 ముందు ఉన్న అసలు టార్గెట్ సీక్వెల్ అనే ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడం కాదు, కార్తీపై తగ్గిన నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోవడం.
అదే సెప్టెంబర్ 10న కార్తీకి పోటీగా ‘మండాది’తో సూరి వస్తున్నాడు. సముద్రం, బోట్ రేసింగ్, స్పోర్ట్స్ రివెంజ్.. వినడానికి కాన్సెప్ట్ డిఫరెంట్ గానే ఉంది. సూరి, సుహాస్, సత్యరాజ్ లాంటి నటులతో తెరకెక్కిన ఈ సినిమా సముద్రతీర నేపథ్యాన్ని, సాంప్రదాయ పడవ పోటీని కథలో భాగించేసుకుంది. కానీ ఇక్కడ మరో రిస్క్.. సముద్రంలో బోట్ రేస్ ఎంత స్పీడ్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కూడా అదే స్పీడ్ లో లేకపోతే ఆడియన్స్ మధ్యలోనే సీట్ దిగి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. పైగా ఒకే రోజు సర్దార్ 2 తో క్లాష్.. ఒకవైపు స్టార్ హీరో కార్తీ, మరోవైపు కంటెంట్ ను నమ్ముకున్న సూరి. ఈ రేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.
సెప్టెంబర్ 24న నాని ‘ది పారడైస్’ తో పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నాడు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్ కూడా డార్క్ యాక్షన్ వరల్డ్ ను చూపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్. దసరా ఇచ్చిన ఇంపాక్ట్ ను ది పారడైస్ రిపీట్ చేయగలదా? అంతేకాదు మార్చ్ నుంచి ఆగస్ట్, అక్కడి నుంచి సెప్టెంబర్ కి రిలీజ్ వాయిదా పడడం కూడా సినిమాపై అంచనాలతో పాటు ప్రశ్నలను పెంచింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా కనిపించడం ఒకెత్త అయితే ఆ రేంజ్ కు తగ్గ కంటెంట్ ఇవ్వడం మరో ఎత్తు. అయితే సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు.
సెప్టెంబర్ 25న బాలీవుడ్ నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కాంబినేషన్ లో ‘ది డివైన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమా వస్తుంది. పేరే తేడా అనుకుంటే కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్. జానపద విన్యాసాలు, అడవిలోని మిస్టరీ, డివోషనల్ టచ్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇలాంటి ఫోక్ లోర్ కథలు ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ పై కొత్త ట్రెండ్ గా మారుతున్నాయి. అలాగని గాడెస్, ఫారెస్ట్ మిస్టరీ, విజువల్స్ చూపిస్తే సరిపోదు. కథలో కొత్తదనం లేకపోతే ది డివైన్ కూడా భారీ కాన్సెప్ట్ ఉన్న మరో నార్మల్ ఫ్యాంటసీ సినిమాగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే సిద్ధార్థ్, తమన్నా కాంబినేషన్ ఈ సినిమాకు ఏ రేంజ్ లో ప్లస్ అవుతుందో చూడాలనే ఆసక్తి బీటౌన్ ఆడియన్స్ లో ఉంది.
సెప్టెంబర్ 10 న సర్దార్ 2 వర్సెస్ మండాది, సెప్టెంబర్ 25 న ది డివైన్.. ఒకటి సీక్వెల్ పై నమ్మకం పెట్టుకుంది, మరొకటి డిఫరెంట్ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ను నమ్ముకుంది, ఇంకొకటి ఫోక్ లోర్ ఫ్యాంటసీతో వస్తుంది. మరి ఇందులో బాక్స్ ఆఫీస్ విన్నర్ ఏదవుతుందో చూడాలి.

