హైదరాబాద్‌లోని ఇందిరా చౌక్ వద్ద శనివారం ఒక ప్రత్యేకమైన ఆందోళన జరిగింది. పురుషులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి “SHE టీమ్స్” తరహాలో “HE టీమ్స్” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా, అడ్వకేట్లు , పలువురు సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మగవారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మహిళల రక్షణ కోసం “SHE టీమ్స్” విజయవంతంగా పనిచేస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో పురుషులు కూడా అనేక అన్యాయాలకు గురవుతున్నారని, వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక టీమ్ అవసరమని ఆందోళనకారులు పేర్కొన్నారు.
Betting : కోడ్ వర్డ్స్, సీక్రెట్ గ్రూప్స్.. బెట్టింగ్ మాఫియా కొత్త ప్లాన్
కొన్ని సందర్భాల్లో మహిళలు తప్పుడు ఆరోపణలతో పురుషులను కేసుల్లో ఇరికిస్తున్నారని, దీని వల్ల అమాయకులైన పురుషులు బాధపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు “HE టీమ్స్” ఏర్పాటు ఒక సమర్థవంతమైన పరిష్కారమని వారు నొక్కి చెప్పారు. ఈ ధర్నాలో పాల్గొన్న బిగ్ బాస్ సీజన్-8 కంటెస్టెంట్ శేఖర్ బాషా మాట్లాడుతూ, “పురుషులు కూడా సమాజంలో బాధితులుగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. SHE టీమ్స్ మహిళలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో, అదే విధంగా HE టీమ్స్ కూడా పురుషులకు రక్షణ కల్పించాలి. అనవసర కేసుల నుంచి, మోసాల నుంచి వారిని కాపాడే వ్యవస్థ అవసరం” అని అన్నారు.