రాకింగ్ స్టార్ యష్ అంటే వెండితెరపై ఓ పవర్ ఫుల్ హీరో. ఆన్ స్క్రీన్ మీద ఆయన ఎంత గంభీరంగా కనిపిస్తాడో, ఆఫ్ స్క్రీన్ లో తన కుటుంబంతో అంత సరదాగా గడుపుతుంటాడు. తాజాగా ‘రామాయణం’ సినిమాతో థియేటర్లలో రావణాసురుడిగా విశ్వరూపం చూపిస్తున్న ఈ కన్నడ సూపర్ స్టార్, అభిమానులకు అదిరిపోయే దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కరుడుగట్టిన రావణుడి గెటప్‌లో ఉండి కూడా తన పిల్లలతో ఎంత క్యూట్ గా అల్లరి చేస్తాడో చూపిస్తూ ఓ అరుదైన బిహైండ్-ద-సీన్స్ (BTS) ఫోటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట సెన్సేషన్ గా మారింది. సహజంగా యశ్ తన వ్యక్తిగత విషయాలను, కుటుంబ ఫోటోలను నెట్టింట పంచుకోవడం చాలా అరుదు. కానీ ఈ దీపావళికి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తూ, ‘రామాయణం’ సెట్స్ లో జరిగిన ఓ మధురమైన సంఘటనను షేర్ చేశాడు. ఆ ఫొటోలో యశ్ పూర్తి రావణాసురుడి అలంకరణలో ఉన్నాడు. ఆ గెటప్ చూస్తేనే భయం వేసేలా ఉన్నప్పటికీ, ఆయన పక్కనే అద్దం ముందు నిలబడి ముద్దుల కూతురు అయ్రా, కొడుకు యథర్వ్ లు చేస్తున్న అల్లరి, వారితో యశ్ తీసుకున్న మిర్రర్ సెల్ఫీ అందరి మనసులను దోచేస్తోంది.
సినిమాలో మహా పరాక్రమవంతుడైన అసుర రారాజుగా నటించిన యశ్.. నిజ జీవితంలో మాత్రం పిల్లల కోసం ఎంతగా తగ్గిపోతాడో ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. ఓ వైపు కళ్లలో రావణుడి రౌద్రం, మరోవైపు పిల్లలతో ఆడుకునే తండ్రి ప్రేమ.. ఈ రెండింటి మధ్య ఉన్న వేరియేషనే ఈ ఫోటోను నెట్టింట వైరల్ గా మార్చేసింది. భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణం’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా సినీ ప్రియులు ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ చూపించిన నట విశ్వరూపానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక ఐకానిక్ విలన్ పాత్రను ఇంత శక్తిమంతంగా, గంభీరంగా ఎవరూ పండించలేరని సినీ విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. తన సినిమాకు, ముఖ్యంగా తన పాత్రకు దేశ నలుమూలల నుంచి దక్కుతున్న ఈ అద్భుతమైన స్పందన చూసి రాకింగ్ స్టార్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తన భార్యాపిల్లలతో ఉన్న మరో అందమైన ఫ్యామిలీ ఫోటోను కూడా పంచుకున్నాడు. “మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. 🙏 మీరు నాపై చూపిస్తున్న ఈ అనంతమైన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు 🤗” అంటూ యశ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

