మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ తో ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘ఖిలాడీ’ దర్శకుడు రమేష్ వర్మకు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ‘ఖిలాడీ’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ను కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. రవితేజ నెక్స్ట్ మూవీకి శరత్ మాండవ దర్శకత్వం వహించనున్నారు. గత కొన్నిరోజుల క్రితమే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. చిత్ర బృందం నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ రవితేజ ఈ కరోనా పరిస్థితుల్లో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. దీంతో సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పలు సినిమాల షూటింగులు రద్దు కావడమే కాకుండా సినిమాల విడుదల కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.