Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”

Y Ravi Shankar

Y Ravi Shankar

Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. “హనుమంతుడి ప్రస్తావన ఉన్న ప్రతి సినిమాను ఆ దేవుడే ముందుకు నడిపిస్తున్నాడేమో అనిపిస్తోంది. గతంలో ‘హను-మాన్’ సినిమా అలాగే ఆడింది, ఇప్పుడు రాజమౌళి గారి ప్రాజెక్ట్ ట్రైలర్‌లోనూ చూశాం. కానీ ‘హనుమాన్ అంశ్’ చేసిన మ్యాజిక్ సాధారణమైనది కాదు. చిన్న బడ్జెట్‌తో వచ్చి ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమానే నిజమైన పాన్-ఇండియా మూవీ. ఏయే భాషల్లో ఇంకా మిగిలి ఉందో వాటన్నింటిలోనూ వెంటనే రిలీజ్ చేయాలి. హోంబలే ఫిలిమ్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ సరైన ప్రాజెక్ట్‌ను పట్టుకుంది, నైజాంలో దీనిని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.

నేటి సమాజంలో ఇలాంటి భక్తిరస చిత్రాల అవసరం ఎంతైనా ఉందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం సోషల్ మీడియా అంతా బురదజల్లుకోవడం, ట్రోలింగ్స్, ఏఐ (AI) మాయతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని తీవ్ర కాలుష్యంతో నిండిపోయింది. ముఖ్యంగా నేటి యువత ఈ ట్రాప్‌లో పడిపోతున్నారు. అలాంటి వారికి మనశ్శాంతిని ఇవ్వడానికి, దేవుడంటే భయం, భక్తిని పెంపొందించడానికి ఇలాంటి దివ్యత్వంతో కూడిన సినిమాలు ఎంతో అవసరం. స్టీవ్ జాబ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు సైతం దర్శించుకున్న గొప్ప దైవస్వరూపం నీమ్ కరోలీ బాబా కథ ఇది. దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి” అని పిలుపునిచ్చారు. నటుడు శోభినవ్ సత్య నటన, దర్శకుడు విశాల్ చతుర్వేది టేకింగ్‌ను కొనియాడిన ఆయన, అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకుల ఆదరణను కూడా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.