రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ ఏడో తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమందికి బాగా కనెక్ట్ అయితే, కొంతమందికి మాత్రం అసలు ఏమాత్రం కనెక్ట్ కాకుండా అయిపోయింది సినిమా పరిస్థితి. అయితే సినిమాకి మాత్రం కలెక్షన్స్ బానే వస్తున్నాయి. ముందు నుంచి సినిమా యూనిట్ చెబుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకి ఏకంగా ఐదు రోజులకు గాను 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read : RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ రోజుల్లో అంత గ్రాస్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో రష్మిక ఒక మాస్ పుల్లర్ అని చెప్పాలి. ఇక ఈరోజు సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో జరగబోతున్న ఈ సక్సెస్ మీట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత మొట్టమొదటిసారి కలిసి ఒకే వేదిక పంచుకుంటూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ మీద విద్య కొప్పినీడితో కలిసి ధీరజ్ మొగిలినేని నిర్మించారు.